
Harish Rao: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ గులాబీ సేన యుద్దం ప్రకటించిందా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి... తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో కేంద్రంపై విరుచుకపడ్డారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర వైఖరిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇది పసలేని బడ్జెట్ అని తీవ్రంగా విమర్శించారు. ఆ తరువాత నుంచి సమయం దొరికితే చాలు... కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడాలని, అవసరం అనుకుంటే కొత్త పార్టీ ఏర్పాటుకు వెనుకంజవేయబోమని, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నాడు.
అతని సారథ్యంలోనే తన మంత్రి వర్గం నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందనీ, అక్రమంగా వేస్తున్న బొగ్గు గనుల వేలాన్ని ఆపాలంటూ కేంద్ర గనుల శాఖ మంత్రికి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. ఈ గనులను వేలం లేకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం.. సింగరేణిని కూడా ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని మండిపడ్డారు
తాజాగా.. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదనీ, రాష్ట్రానికి రావల్సిన నిధుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ.. మంత్రి హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖలో గుర్తు చేశారు. ఇవే అంశాలతో ఈ ఏడాది జనవరి 24న లేఖ రాసిన విషయం తెలిసిందే..
లేఖలో పేర్కొన్న విజ్ఞప్తులివే...
1, A.P. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉన్నది. వీటిని విడుదల చేయడంతోపాటు గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని కోరారు. నీతిఆయోగ్ సూచించిన మేరకు రూ.24,205 కోట్లు విడుదల చేయాల్సిందిగా తెలిపారు.
2, స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అకారణంగా తిరస్కరించింది. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించారు. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చూడాలని అభ్యర్థించారు.
3, 2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని, ఈ మేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో ఎప్పుడూ తిరస్కరించిన సందర్భాలు లేవు. కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నిధులను మంజూరు చేయాలని కోరారు.
4, రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో... రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొరబాటున తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారు. దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఇంకా తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదు. కాబట్టి ఈ మొత్తాన్ని వెంటనే తెలంగాణకు విడుదల చేయవలసిందిగా కోరారు.
5. వీటితోపాటు పెండింగ్ లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను కూడా సర్దుబాటు చేయాల్సిందిగా విన్నవించుకున్నారు.