పోలీసులు వచ్చేలోగా పరార్: విచారణలో పెదవి విప్పిన పుట్ట మధు

By telugu teamFirst Published May 8, 2021, 6:24 PM IST
Highlights

వామన్ రావు దంపతుల హత్య కేసులో పది రోజుల క్రితం పోలీసులు పుట్ట మధుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దాంతో విచారణ నిమిత్తం వచ్చిన పుట్ట మధు పోలీసులు వచ్చేలోగా పరారైనట్లు సమాచారం.

కరీంనగర్:  పోలీసుల విచారణలో టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు నోరు విప్పినట్లు తెలుస్తోంది. భీమవరంలో అరెస్టు చేసిన పుట్ట మధును పోలీసులు రామగుండంలో విచారిస్తున్నారు గంటల తరబడిగా విచారణ సాగింది. పలు కోణాల్లో ఆయనపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. చివరకు విచారణలో పుట్ట మధు నోరు తెరిచినట్లు చెబుతున్నారు.

పది రోజుల క్రితం పుట్ట మధుకు విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసుల జారీ చేశారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనను విచారించాలని అనుకున్నారు. పోలీసుల నోటీసుల మేరకు మధు విచారణ నిమిత్తం గెస్ట్ హౌస్ కు వచ్చారు. అయితే, పోలీసులు వచ్చే లోగా అక్కడి నుంచే పుట్ట మధు పారిపోయారని సమాచారం. గన్ మెన్ ను, డ్రైవర్ ను వదిలేసి ఆయన పారిపోయారు. అప్పటి నుంచి పోలీసులు ఆయన కోసం గాలిస్తూనే ఉన్నారు. 

Also Read: 10 రోజులు ఎక్కడికెళ్లారు.. ఫోన్ ఎందుకు స్విచ్ఛాప్ చేశారు: పుట్టా మధుపై పోలీసుల ప్రశ్నలు

తనను అరెస్టు చేస్తారనే భయంతోనే పారిపోయినట్లు పుట్ట మధు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పర్యటించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ఉండి ఆ తర్వాత ఛత్తీస్ గడ్ కు వెళ్లినట్లు, అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు పెట్టారు. 

ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో రెండు రోజుల పాటు ఉండి భీమవరం చేరుకున్నారు.భీమవరంలోని ఓ హోటల్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆయన రాజమండ్రి నుంచి భీమవరం చేరుకుని అక్కడ చేపల చెరువుల వద్ద మకాం వేసినట్లు పోలీసులు గుర్తించి, అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: వామన్ రావు దంపతుల హత్య కేసు: ప్రత్యేక కోర్టుకు కేసీఆర్ ప్రభుత్వం లేఖ

ఏప్రిల్ 30వ తేదీన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. చివరకు భీమవరంలో ఆయనను కనిపెట్టి అదుపులోకి తీసకున్నారు.

పుట్ట మధును రేపు ఆదివారం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పుట్ట మధు మొదటినుంచి వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంటూ వస్తున్నారు.
 

click me!