పీసీసీ చీఫ్ సెర్చ్: ఉత్తమ్ తో సుదీర్ఘ చర్చలు, హుటాహుటిన ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

By telugu teamFirst Published Jun 21, 2021, 1:05 PM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు నియామకం త్వరలో జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత వెంటనే ఢిల్లీకి వెళ్లారు.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ పదవి కోసం పలువురు పోటీ పడుతుండడంతో ఎంపిక అధిష్టానానికి కొరుకుడు పడడం లేదు. పైగా తెలంగాణ నేతల మధ్య విబేధాలు కూడా పీసీసీ అధ్యక్షుడి ఎంపికను క్లిష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిసీసీ అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరుగుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 

ఈ నేపథ్యంలో ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వారిద్దరి మధ్య దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆదివారంనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం. దీంతో శుభాకాంక్షలు తెలిపేందుకు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఉత్తమ్ నివాసానికి ెవళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య సుదీర్ఘమైన భేటీ జరిగింది. 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో, పార్టీ అధిష్టానం ఆలోచన, రాష్ట్రంలోని పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ భేటీ తర్వాత సాయంత్రం కోమటిరెడ్డి వెంకట రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దాంతో ఇరువురి మధ్య భేటీకి రాజకీయ ప్రాధాన్యం చేకూరింది.

కోమటిరెడ్డి ఇటీవల నాలుగు రోజుల పాటు హస్తినలో ఉండి వచ్చారు. ఆ పర్యటనలో ఆయన అధిష్టానం పెద్దలను కూడా కలిశారు. ఈ స్థితిలో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. తనను పిసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసే విషయంలో ఎందుకు జాప్యం చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ కెసి వేణుగోపాల్ ను అడిగినట్లు తెలుస్తోంది. 

అదే సమయంలో తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ కు ఫోన్ చేసి కాస్తా కఠినంగా కూడా మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ ఎంపికపై అధిష్టానం పెద్దలతో మాట్లాడేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.

click me!