పవన్ ఇక తెలంగాణా దారి పడతాడా...

Published : Jan 18, 2017, 04:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పవన్ ఇక తెలంగాణా దారి పడతాడా...

సారాంశం

చేనేత సమస్య తీసుకుని పవన్ తెలుగోడిగా ఎదుగుతాడా లేక అంధ్రోడిగా కుంచించుకుపోతాడా?

జనసేన నేత పవన్ కల్యాణ్ మొత్తానికి తెలంగాణాలో కూడా ప్రవేశించే  మార్గం కనిపించింది.

 

 ఇపుడాయన చే‘నేత’ కూడా కావచ్చు.

 

2019 ఎదురుగా కనిపిస్తున్నపుడు చేనేత సమస్యను  ఆలస్యంగా నైనా గుర్తించడంతో పవన్ కల్యాణ్ కు రాజకీయం అర్థమవుతున్నదనే అనుకోవాలి. చేనేత పేరుతో ఆయన ఇపుడు తెలంగాణా జిల్లాలలో కూడా పర్యటించవచ్చు.తెలంగాణా అంతటా సమస్యలున్నాయని, ఇప్పటి ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు పాటించి తెలంగాణాను నాశనం చేస్తున్నదని ప్రొఫెసర్ కోదండ్ రా మ్ వంటి మేధావులు తీవ్రంగా జనసమీకరణ చేస్తున్నారు. పవన్ కు కూడా  అక్కడ  చోటున్నట్లే లేక్క.

 

రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు  నాయుడిలాగానే పవన్ కల్యాణ్  కూడా తెలంగాణా  వదిలేసి పారిపోయాడనే విమర్శ ఉంది. తెలంగాణా ప్రభుత్వం మీద ఏ విమర్శ చేసినా ఆంధ్రోడని ముద్రవేసి రాళ్లేస్తారనే భయం పవన్ కల్యాణ్ లో ఉందని అనుకుంటున్నారు.  అందుకే  తన రాజకీయ కార్యకలాపాలను కేవలం ఆంధ్రకే పరిమితం చేసుకుని పర్యటనలు చేస్తున్నారు. పవర్ స్టార్ కు ఇంతభయమేమిటి? అయన తెలంగాణా అభిమానులు విస్తుపోయే పరిస్థితి తీసుకువచ్చారు.

 

ఇపుడు  తానూ ఒక వైపు నుంచి తెలంగాణాలో ప్రవేశించేందుకు చేనేత సమస్య దారి చూపింది.

 

పవన్ జన సేన ఆంధ్రోడి గా కుంచించుకు పోతాడా లేక  తెలుగోడిగా ఎదిగేందుకు కష్టపడతాడా చూడాలి.

 

 చేనేత సమస్య ఆయనకు  ఒక మంచి ఆయుధం అందించింది. వాడుకుంటాడా, మనకెందుకు లే అని వదలుకుంటాడా? పవన్ పారిపోయాడని  చేస్తున్న విమర్శకు సమాధానం తెలంగాణాలో  చేనేత యాత్ర  పూనుకోవడమే.

 

 చేనేత సమస్య అంత సులభంగా పరిష్కారమయ్యేది కాకపోయినా, సంఖ్యారీత్యా బలమయిన బిసి వర్గానికి ఆయనను చేరువచేసే ఒక పెద్దసమస్య.

 

ఉద్దాణం కిడ్నీ సమస్య ఎంతో హృదయవిదారకమయినదో చేనేత సమస్య కూడా అంతే. పేదరికం, ప్రభుత్వాల  విధానాలు, ఈ వర్గం నుంచి పెద్ద రాజకీయ సమీకరణ లేకపోవడం, సంక్షోభం అన్నీ కలసి చేనేత కుటుంబాలను ఆత్మహత్యల వైపు నడిపించాయి. వారి జీవితాలను రోగాల కూపంగా మార్చేశాయి.  చంద్రబాబు నాయుడి దగ్గిర నుంచి కెసిఆర్ దాకా, చేనేత సమస్య అంటే, అది కాలంచెల్లిన వృత్తి అని అంతా మానుకుని వేరే పనులు చూసుకోవాలనే విధానం అనుసరిస్తున్నారు.

 

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే,చేనేత వస్త్రాలకు స్వర్ణయుగం తీసుకురావచ్చు. ప్రజలలో చేనేత మోజు పెరుగుతూ ఉంది. కాకపోతే, ఈ రంగానికి భ్రదత లేకపోవడంతో చేనేత వస్త్రాలను మిల్లులు కోట్టేస్తున్నాయి.

 

ఇలాంటపుడు పవన్ కల్యాణ్ చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ముందుకు రావడం ఒక మంచిపరిణామం. 

 

నిజానికి పవన్ లైఫ్ స్టయిల్ చేనేత అనుకూలమయినదే. దానిని ఆయన గమనించి ఉండకపోయివుండవచ్చు. ఎపుడూ సింపుల్ గా కనిపించడానికి ఇష్టపడే పవన్ చేనేతలోకి మారడం పెద్దపనికాదు. మడతలు కూడా పడని ఖరీదయిన మిల్లు ఖాదీ, లినెన్ వేసుకునే వారికి మాత్రమే అది సమస్య.

 

 

చేనేత సమస్య రెండురాష్ట్రాలలో ఉన్నా తెలంగాణాలో ఇంకా తీవ్రంగా ఉంది.రైతుల తర్వాత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్న కులవృత్తి దారులు చేనేత వారే.గతంలో చిరంజీవి సిరిసిల్లను సందర్శించాకే అన్ని పార్టీలు నేతన్నఅంటూసిరిసిల్లకు పరుగుతీశాయి.

 

ఆంధ్రోడని కొంత మంది వెక్కిరించినా, ఆయన బెదరాల్సిన  పని లేదు.  అయితే, ఆయన తెలంగాణాను పూర్తిగా వదిలేస్తే ఈ విమర్శ ఇంకా తీవ్రమవుతుంది.

 

తెలంగాణాలో కూడా జనసేన అవసరముందని పవన్ కల్యాణ్ చేనేత  పర్యటన ద్వారా గుర్తించాలి. ఇప్పటికే అనేక ప్రజాసంఘాలు తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలకోసం పోరాడుతున్నాయి. పవన్ కూడా కొంత జాగా సాధించుకోవాలి.

 

ఇపుడు  చేనేత అనేది జాతి సంపదని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెబుతూ  ఆ కుటుంబాలను ఆదుకునేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదికల ప్రతినిధులు హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌ని కలిసినపుడు ఆయన ఈ  హామీ ఇచ్చారు.

 

ఈ ప్రతినిధులు రెండు రాష్ట్రాల్లో సంభవిస్తున్న నేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు వివరించారు.

 

ఈ దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని వారు తెలిపారు.

 

వచ్చే నెలలో మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొని తమ పక్షాన నిలవాల్సిందిగా వారు ఆయనని కోరారు. పవన్‌కల్యాణ్‌ అంగీకరించారు.  మంగళగిరి తర్వాత  తెలంగాణా పర్యటన గురించి కూడా ఆలోచిస్తారా లేక  ఈ తలనొప్పి ఎందుకులే అనుకుంటారా?

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్