
ఖమ్మం : అదీ ఇదని కాదు మగవారితో సమానంగా అన్నిరంగాల్లోనూ రాణిస్తూ 'ఆడది అబల కాదు సభల' అని ఈ లోకానికి చాటిచెబుతున్నారు నేటి తరం మహిళాలోకం. దేశాధినేతలుగా పాలిస్తున్నారు, సీఈవోలుగా రాణిస్తున్నారు, ఉద్యోగులుగా కుటుంబారాన్ని మోస్తున్నారు. అయినా మహిళలపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఓ మహిళ ప్రథమ పౌరురాలిగా వున్న మనదేశంలో ఇప్పటికీ అమ్మాయి పుడితే భారంగా భావించే తల్లిదండ్రులే ఎక్కువగా కనిపిస్తారు. ఇలాంటి ఓ కసాయి తల్లిదండ్రులు ప్రేమానురాగాలు, కడుపుతీపిని మరిచి పురిట్లోని ఆడబిడ్డను హాస్పిటల్లోనే వదిలేసి కాదు కాదు వదిలించుకుని వెళ్లిన అమానుషం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.
పోలీసులు, హాస్పిటల్ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఓ మహిళ ప్రసవం జరిగింది. మగబిడ్డ పుడతాడని మహిళతో పాటు కుటుంబసభ్యులు భావించగా వారి ఆశలు తలకిందులై ఆడ బిడ్డ పుట్టింది. దీంతో ఆ తల్లిందండ్రులు పేగుబంధాన్ని మరిచి అమానవీయంగా వ్యవహరించారు. పురిట్లోని బిడ్డను హాస్పిటల్లోనే వదిలేసి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారు.
Read More పల్నాడు జిల్లా : సత్తెనపల్లిలో శిశువు కిడ్నాప్‌కు కిలాడీ లేడీ విఫలయత్నం
ఊయలలో శిశువు ఆకలితో గుక్కపట్టి ఏడవడంతో హాస్పిటల్ సిబ్బంది గమనించారు. ఆ చిన్నారిని తల్లిదండ్రులు కావాలనే వదిలివెల్లినట్లు గుర్తించి పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు వుండి అనాధగా మారిన బిడ్డను ఖమ్మం శిశుగృహకు తరలించారు అధికారులు. అక్కడే ఆ పసిగుడ్డును పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.