భూపాలపల్లి : ఆర్థిక కష్టాలతో ఉపసర్పంచ్ ఆత్మహత్య... దిక్కులేనివారైన ఇద్దరు ఆడబిడ్డలు

By Arun Kumar PFirst Published Jan 1, 2023, 8:08 AM IST
Highlights

ఎనిమిది నెలల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో కనీసం పదేళ్లుకూడా నిండని ఇద్దరు ఆడబిడ్డలు అనాధలుగా మారారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

భూపాలపల్లి : గ్రామ అభివృద్ది పనుల కోసం అప్పులు తెచ్చిమరీ ఖర్చుచేసి చివరకు ఆర్థిక ఇబ్బందులతో ఉపసర్పంచ్ దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక... తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. ఇలా గ్రామానికి ఏదో చేయాలని కలలుగన్న ఉపసర్పంచ్ చివరకు సొంతబిడ్డలనే అనాధలను చేసాడు. 

వివరాల్లోకి వెళితే... భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినెపల్లి గ్రామానికి చెందిన బాల్నె తిరుపతి(34)కి రాజకీయాలంటే ఆసక్తి వుండేది. గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో గత సర్పంచ్ ఎన్నికల్లో వార్డ్ మెంబర్ గా గెలిచి ఉపసర్పంచ్ పదవిని చేపట్టాడు. అప్పటినుండి సొంత డబ్బులతో గ్రామ అభివృద్ది పనులు చేయడం ప్రారంభించారు. ఇలా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిమరీ గ్రామ పనుల కోసం ఖర్చుచేసాడు. ఇలా తిరుపతి ఇప్పటివరకు దాదాపు రూ.13 లక్షలు గ్రామాభివృద్ది పనుల కోసం వెచ్చించాడు.  

అయితే తాను ఖర్చుచేసిన డబ్బులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో... వడ్డీలేమో భారీగా పెరిగిపోతుండటంతో తిరుపతినే కాదు ఆయన కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. ఈ ఆర్థిక కష్టాలతోనే తిరుపతి భార్య సరిత 8 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుండి ఇద్దరు బిడ్డల ఆలనపాలన తిరుపతే చూసుకునేవాడు. అయితే అప్పుల బాధ మరింత పెరగడంతో తిరుపతి కూడా దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

ముక్కపచ్చలారని ఇద్దరు ఆడబిడ్డల గురించి ఆలోచించకుండా  ఉపసర్పంచ్ తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. 

తల్లిదండ్రుల మృతితో అనాధలుగా మారిన చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూసేవారితోనూ కంటతడి పెట్టిస్తోంది. ఇలా గ్రామాభివృద్దికోసం తాపత్రయపడిన ఉపసర్పంచ్ చివరకు ప్రాణాలు కోల్పోయి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసుకున్నాడు. 

click me!