జూనియర్ పంచాయితీ సెక్రటరీలు వెంటనే విధుల్లోకి చేరాలని తెలంగాణ సర్కార్ అల్టిమేటం ఇచ్చింది. కానీ తమ డిమాండ్లు సాధించేవరకు సమ్మె విరమించబోమని జూనియర్ పంచాయితీ సెక్రటరీలు తేల్చి చెప్పారు.
హైదరాబాద్:జూనియర్ పంచాయితీ కార్యదర్శులు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. మంగళవారంనాడు సాయంత్రం ఐదు గంటల లోపుగా విధుల్లో చేరకపోతే విధుల నుడి తొలగిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అయితే తాము మాత్రం సమ్మెను విరమించేది లేదని జూనియర్ పంచాయితీ కార్యదర్శులు తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు.
జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోపుగా విధుల్లో చేరాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. విధుల్లో చేరే ముందు సమ్మె చేయబోమని, యూనియన్లు ఏర్పాటు చేయబోమని తదితర డిమాండ్లపై అగ్రిమెంట్ రాసిచ్చారని మంత్రి దయాకర్ రావు గుర్తు చేశారు.
జూనియర్ పంచాయితీ కార్యదర్శులతో తాము చర్చలు చేసినట్టుగా కూడా దయాకర్ రావు చెప్పారు. అయితే జూనియర్ పంచాయితీ కార్యదర్శులతో చర్చలను కొందరు చెడగొట్టారని దయాకర్ రావు చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ తో జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీ నుండి జూనియర్ పంచాయితీ కార్యదర్శులు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు బీజేపీ మద్దతు ప్రకటించింది. జేపీఎస్ ల సమ్మెకు సంఘీభావం తెలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. నిన్న పార్టీ నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు