మునుగోడులో ప్రచారానికి రావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరానని కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి చెప్పారు.ఈ విషయమై ఆలోచిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు
మునుగోడు: ప్రచారానికి రావాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరినట్టుగా మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నపాల్వాయి స్రవంతి చెప్పారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి మంగళవారం నాడు ఓ తెలుగున్యూస్ చానెల్ తో మాట్లాడారు.తనకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశీర్వాదం అందించినట్టుగా చెప్పారు. ఆశీర్వాదం కాదు ప్రచారానికి రావాలని ఆయన కోరారు. ప్రచారానికి రావడంపై ఆలోచిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారన్నారు.మునుగోడు బిడ్డగా ప్రజలు తనను ఆదరిస్తారని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.
ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాంధీ భవన్ కు పాల్యాయి స్రవంతి వచ్చారు .అయితే అదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా గాంధీ భవన్ కు వచ్చారు. ఈ సయంలో మునుగోడులో ప్రచారానికి రావాలని పాల్వాయి స్రవంతి కోరారు.
మునుగోడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్ననే స్పష్టం చేశారు. హోంగార్డులు ప్రచారం నిర్వహిస్తే ఎవరు ఓట్లేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎస్పీలు వెళ్లి ప్రచారం చేయాలన్నారు.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారానికి రావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కోరారు .పార్టీ టికెట్ ఖరారైన తర్వాత పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు .ప్రచారానికి రావాలని అభ్యర్ధించారు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ప్రచారానికి వెళ్లలేదు. గతంలో తనను ఉద్దేశించి రేవంత్ రెడ్డి,పార్టీ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను మరోసారి కాంగ్రెస్ నేత గుర్తు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను రేవంత్ రెడ్డి,అద్దంకి దయాకర్ లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు . తనను వ్యక్తిగతంగా దూషించిన తర్వాత కూడా ప్రచారానికి ఎలా వస్తారని తనను తన అభిమానులు ప్రశ్నిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు .
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి బరిలోకి దిగారు. స్వంత సోదరుడు బీజేపీ నుండి పోటీ చేస్తున్న తరుణంలో ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్ధికి ప్రచారం చేయడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇబ్బందిగా మారింది.ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి వెంకట్ రెడ్డి తీసుకెళ్లారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
also read:మునుగోడు బైపోల్ 2022:చల్మెడ వద్ద కారులో రూ.కోటి స్వాధీనం
వచ్చే నెల 3న మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 8న రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.ఈ దఫా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా మునుగోడు నుండి పోటీ చేస్తున్నారు.