
జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌పై తెలంగాణ హైకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. ఓ డిమాండ్ నోటీసు వివాదంలో కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో సోమవారం హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. అయితే అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ విజ్ఞప్తి మేరకు లోకేష్ కుమార్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేసింది. అయితే ఈ నెల 27న లోకేష్ కుమార్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
వివరాలు.. జీహెచ్‌ఎంసీ జారీచేసిన డిమాండ్ నోటీసుపై మూసాపేట్‌లోని M/s యునైటెడ్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సయ్యద్ అస్లాం, ఇతర భాగస్వాములు హైదరాబాద్‌లోని చీఫ్ జడ్జి సిటీ స్మాల్ కాజెస్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కోర్టు తీర్పును, డిక్రీని కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో సివిల్ మిసిలేనియస్ సెకండ్ అప్పీల్ (CMSA) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జస్టిస్ ఎం లక్ష్మణ్.. అక్టోబర్ 17న జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
అయితే హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టు హాల్‌కు వెళ్లి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై ఎన్‌బీడబ్ల్యూని కొట్టివేయాలని కోరారు. ఏజీ అభ్యర్థన మేరకు అక్టోబరు 27న జీహెచ్ఎంసీ కమిషనర్ తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించిన కోర్టు.. ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేసింది.