తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ.. జనగాం, నారాయణపేట్ లకు తొలిసారి..

By SumaBala BukkaFirst Published Jan 26, 2024, 11:27 AM IST
Highlights

2024 సంవత్సరానికి గాను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది.  దీంట్లో తెలంగాణకు ఐదు పద్మశ్రీ అవార్డులు వరించాయి. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ళకు మొట్టమొదటిసారిగా  తెలంగాణలోని జనగామ, నారాయణపేట  జిల్లాలు అవార్డుకు నోచుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మొత్తంగా ఎనిమిది పద్మ పురస్కారాలు రాగా అందులో.. ఆంధ్రప్రదేశ్ కు రెండు పద్మ విభీషణులు, ఒక పద్మశ్రీ ఉన్నాయి.
 

తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు దక్కిన ఐదుగురిలో జనగామ జిల్లాకు చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, యాదాద్రి శిల్పకారుడు వేలు ఆనందాచారిలకు కళాకారుల కేటగిరిలో పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

ఇక సాహిత్య రంగంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్ లకు పద్మశ్రీలు వచ్చాయి. ఇందులో కూరెళ్ల విఠలాచార్య ప్రముఖ సాహితీవేత్త, ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. వీరి గురించిన వివరాలు ఇవి... 

Latest Videos

గడ్డం సమ్మయ్య
సమ్మయ్య వయసు 62 సంవత్సరాలు, స్వస్థలం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి. ఐదో తరగతి వరకు చదువుకున్న సమ్మయ్య చిందు యక్షగానంలో పేరొందరు. 12 ఏళ్ల వయసు నుంచే రంగస్థలం వేదిక మీద రకరకాల పాత్రలు వేస్తూ యక్షగాన కళను ప్రదర్శిస్తున్నారు. గత ఐదు దశాబ్దాలుగా 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు గడ్డం సమ్మయ్య. చిందు యక్షగానం సజీవంగా ఉండేందుకు తన వంతుగా..‘చిందు యక్ష కళాకారుల సంఘం’, ‘గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం’ లాంటివి స్థాపించి సేవ చేస్తున్నారు. 

Padma Awards 2024: ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇదే..

దాసరి కొండప్ప
నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్య కళాకారుడు. రామాయణం, మహాభారతం, హరిచంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాధలను వీణ మీద వాయిస్తూ చెప్పడం ఆయన ప్రత్యేకత.  ఇలా.. ప్రత్యేకంగా బుర్రవీణ మీద కథలు వాయిస్తూ చెబుతున్న వారిలో దాసరి కొండప్ప ఒకరే మిగిలి ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు.  తాను వాయించే బుర్రవీణను స్వయంగా ఆయనే తయారు చేసుకున్నారు. దూరదర్శన్లో కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

కేతావత్ సోమ్లాల్
కేతావత్ సోమ్లాది మరో స్ఫూర్తిదాయకమైన జీవితం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావి తండాకు చెందిన సోమ్లాల్ బంజారా భాషలో భగవద్గీతను అనువదించారు. భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు కష్టపడి తెలుగు లిపితో బంజారా భాషలోకి అనువదించారు. ఆయన ఇప్పటివరకు బంజారా జాతి జాగృతి కోసం ఎంతో కృషి చేశారు 200 కి పైగా పాటలు రాశారు. కేతావత్ సోమ్లాల్ ఎస్బిఐలో పనిచేసి, పదవీ విరమణ చేశారు.

కూరెళ్ల విఠలాచార్య
కూరెళ్ల విఠలాచార్య యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టారు. ఆయన కవి. 2014లో తన ఇంటిని లైబ్రరీగా మార్చాడు.  మొదట ఐదువేల పుస్తకాలతో మొదలైన ఈ లైబ్రరీ ప్రస్తుతం రెండు లక్షలకు పైగా గ్రంథాలతో విరాజిల్లుతోంది. దాదాపు 8 మంది విద్యార్థులు ఇక్కడ పరిశోధనలు చేసి పీహెచ్డీలు అందుకున్నారు.  విఠలాచార్య చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ లో ఇటీవల ప్రస్తావించారు.

ఆనందాచారి వేలు
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లికి చెందిన ఆనందాచారి వేలు హైదరాబాదులో స్థిరపడ్డారు. 1952లో పుట్టిన ఆనందాచారి 1980లో దేవాదాయ శాఖలో సహాయ సపతిగా చేరారు. అలా అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, బాసర, యాదగిరిగుట్ట, వేములవాడ, శ్రీ కాళహస్తి ఆలయాల్లో స్థపతిగా పనిచేశారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టిన తర్వాత 2017 లో యాదాద్రి ఆలయ  అభివృద్ధి ప్రాధికార సంస్థ  ప్రధాన స్థపతిగా ఆనందాచారి వేలును నియమించింది. 2017లో ఆనందాచారి శిల్పకళా విభాగంలో ప్రతిభా పురస్కారం కూడా అందుకున్నారు. 

click me!