
తెలంగాణ రాష్ట్రం పద్మాలతో వికసించింది. రాష్ట్రానికి ఈ సారి రికార్డు స్థాయిలో 8 ‘పద్మ’ అవార్డులొచ్చాయి. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు తెలంగాణకు చెందిన ఏడుగురికి కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది.
2017 సంవత్సరానికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. ఈసారి అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ఎవరికీ ప్రకటించలేదు. పద్మవిభూషణ్ ఏడుగురికి, పద్మభూషణ్ ఏడుగురికి ప్రకటించారు. 75 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో ఏడుగురు తెలంగాణవారు కూడా ఉన్నారు.
తెలంగాణ అమరవీరుల స్థూప రూపశిల్పి డాక్టర్ ఎక్కా యాదగిరిరావుకు ఆర్ట్, స్క్లప్చర్ విభాగంలో అవార్డు ప్రకటించగా,
సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో చేనేతకు సంబంధించి ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశంకు అవార్డు దక్కింది.
ఖమ్మ జిల్లాకు చెందిన వనజీవి రామయ్యకు సామాజిక సేవ విభాగంలో అవార్డు వరించింది. ఈయన దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ హరితవనాన్ని సృష్టిస్తున్నారు.
సివిల్ సర్వీస్ విభాగంలో హైదారబాద్ కు చెందిన త్రిపురనేని హనుమాన్ చౌదరికి అవార్డు వచ్చింది. మెడిసన్ విభాగంలో నగరానికి చెందిన డాక్టర్. మహ్మద్ అబ్దుల్ వాహీద్ ఎన్నికయ్యారు.
పరిశ్రమలు, వాణిజ్యం విభాగంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీ మోహన్ రెడ్డి పద్మ అవార్డు దక్కించుకున్నారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో చంద్రకాంత్ ను పద్మ అవార్డు వరించింది.