
Ganesh Chaturthi : వినాయక నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ మహానగరం సిద్దమవుతుంది. ప్రతీ ఏడాదిలాగేనే ఈ ఏడాది కూడా గణేష్ పండుగ అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా నగరంలో వేలాది గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తారు. ఎన్ని మండలాలు ఏర్పాటు చేసినా.. ఎంత భారీ గణనాథుడ్ని పెట్టినా దేనికదే స్పెషల్. ఈ నేపథ్యంలో "ఆపరేషన్ సింధూర్" థీమ్‌తో ఉన్న గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ గణపయ్య భారత సైనికుడిలా మనందరికీ దర్శనమిస్తూ.. నవరాత్రులు పూజలు అందుకోవడానికి సిద్దమవుతుంది. ఇంతకీ ఆ ప్రత్యేక గణనాథుడు ఎక్కడ కొలువుదీరబోతున్నారంటే?
ప్రతీ ఏటా వినూత్నంగా గణపయ్య విగ్రహాలను ప్రతిష్టించే ఉప్పుగూడ శ్రీ మల్లికార్జున్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈసారి కూడా ప్రత్యేక థీమ్ తో ముందుకు వచ్చింది. అదే "ఆపరేషన్ సింధూర్"( Operation Sindoor-Themed Ganesh Idol) థీమ్. ఈ ఏడాది ఈ థీమ్ తో ప్రత్యేక గణేశుడిని ప్రతిష్టించబోతున్నారు. స్థానిక కళాకారులు రూపొందించిన ఈ విగ్రహం ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రూపంలో గణేశుడిని తీర్చిదిద్దగా, ఆయన చుట్టూ బ్రహ్మోస్, ఎస్-400 రైఫిల్స్, ఆర్మీ మోడల్స్ ప్రతిష్టించారు. ఈ విగ్రహం రూపకల్పనకు సుమారు ₹6 లక్షలు ఖర్చైనట్లు నిర్వాహకులు తెలిపారు.
శ్రీ మల్లికార్జున్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ "ఈ ప్రత్యే విగ్రహం కోసం రెండు నెలల క్రితం ఆర్డర్ ఇచ్చామనీ, తమకు ఆ విగ్రహాన్ని ఆగస్టు 15న విగ్రహం డెలివరీ చేశారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ థీమ్ తో గణపయ్యను ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ స్టైల్లో తయారు చేయించామనీ, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పై 20 నిమిషాల వీడియో రూపొందించామని తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ప్రదర్శించబోతున్నామన తెలిపారు.
ప్రతి ఏడాది తాము కొత్త కాన్సెప్ట్‌లో గణపయ్యను ప్రతిష్టిస్తున్నామనీ, 2023లో చంద్రయాన్ మోడల్ గణేశుడు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి దైవ భక్తితో పాటు దేశ భక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ థీమ్‌ను ఎంచుకున్నామని, ఈ మండపాన్ని దర్శించే భక్తులకు ఆపరేషన్ సింధూర్ ప్రాధాన్యం,భారత ఆయుధాల శక్తి గురించి తెలియజేయడమే తమ ఉద్దేశ్యమని నిర్వహకులు వివరించారు.
ఆపరేషన్ సింధూర్ థీమ్ లో భాగంగా భారతదేశ సైనిక చరిత్రలోని కీలక ఘట్టాలను చూపే పోస్టర్లను కూడా ప్రదర్శిస్తున్నారు. వీటిలో ఇండో-పాక్ యుద్ధాలు, బంగ్లాదేశ్ విముక్తి , కార్గిల్ యుద్ధం, ఉరి దాడి, పుల్వామా దాడితో పాటు 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్ వంటి సంఘటనలు ఉన్నాయి. ఈ విగ్రహం వినూత్నత, సాంకేతికత, సైనిక ప్రేరణ కలిగినదిగా ఉండడంతో ఉప్పుగూడలోని భక్తులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. గ్రాండ్ వెల్‌కమ్‌తో గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు సిద్ధంగా ఉన్నారు.