ఈ రోజు మీరు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..

Published : Aug 23, 2025, 06:56 AM IST
Daily News Brief

సారాంశం

Today’s News Roundup 23th August 2025: ఇవ్వాళ్టి వార్తల్లోని ప్రధానాంశాలు శునకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, అమెరికా వీసాలపై భారీ సమీక్ష,  భారత స్పేస్ స్టేషన్ నమూనా ఆవిష్కరణ,   ఏపీ డీఎస్సీ 2025 మెరిట్ లిస్ట్ విడుదల,  

Today’s News Roundup 2 3th August 2025: 

Stray Dogs: శునకాలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు – సుప్రీంకోర్టు కీలక తీర్పు

దేశంలో వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వీధులు, బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం చట్టవిరుద్ధమనీ, మున్సిపాలిటీలు వార్డుల వారీగా ఫీడింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, అక్కడే ఆహారం ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది. . వీధి కుక్కలకు తప్పనిసరిగా టీకాలు వేసి, సంతాన నిరోధక చికిత్స చేసిన తర్వాత మళ్లీ అదే ప్రాంతంలో వదిలిపెట్టాలని ఆదేశించింది. అయితే రేబిస్ వ్యాధి కారకంగా ఉండే లేదా మనుషులపై దాడి చేసే స్వభావం కలిగిన కుక్కలను మాత్రం షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది.

మున్సిపల్ అధికారులు తగిన షెల్టర్లు నిర్మించి, కనీస సదుపాయాలు కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. నిర్దేశిత ఫీడింగ్‌ కేంద్రాల వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేసి, కుక్కలకు ఆహారం ఇవ్వాలంటే అక్కడే ఇవ్వాలని, ఉల్లంఘన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీకరణ కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఈ కేసుల్లో పిటిషనర్లు వ్యక్తులు రూ.25 వేలూ, సంస్థలు రూ.2 లక్షలూ కోర్టులో డిపాజిట్ చేయాలని, ఆ నిధులను షెల్టర్ల నిర్మాణం, శునకాల సంరక్షణకు వినియోగిస్తామని తెలిపింది. వీధి కుక్కలను పెంచుకోవాలనుకునే జంతు ప్రేమికులు మున్సిపల్ అధికారులను సంప్రదించి దత్తత తీసుకోవచ్చని, కానీ వాటిని మళ్లీ వీధుల్లోకి రానీయకుండా పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించింది. నిషేధం ఆదేశాలను సవరించిన ఈ తీర్పుతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.

Telangana High Court: అనుమతి లేని కేబుళ్లపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌లో విద్యుత్‌ స్తంభాలకు విచ్చలవిడిగా వేసిన అనుమతి లేని కేబుళ్లపై తెలంగాణ హైకోర్టు కఠినంగా స్పందించింది. రామంతాపూర్‌లో విద్యుదాఘాతంతో ఆరుగురు మరణించిన ఘటన నేపథ్యంలో ఈ సమస్యపై విచారణ జరిపిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని కేబుళ్లను ప్రభుత్వం తక్షణమే తొలగించాలని, అనుమతి ఉన్న కేబుళ్లను మాత్రమే కొనసాగించాలనీ స్పష్టం చేశారు. అనుమతి ఉన్న కేబుళ్లలో సమస్యలు ఉంటే చట్టప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ కేబుళ్ల తొలగింపులో ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం, టీజీఎస్పీడీసీఎల్‌కు సూచించారు.

విచారణ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్‌ తరఫున వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల కరెంటు స్తంభాల్లో కేవలం 1.73 లక్షలకే అనుమతులు ఉన్నట్లు తెలిసింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “కేబుళ్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోతుంటే, కింద సిబ్బంది అక్రమ సొమ్ము సంపాదిస్తున్నారా?” అని ప్రశ్నించింది. ఆరు కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహించాలనే అంశంపై శాఖలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలని తేల్చి చెప్పింది. ప్రజలకు ముప్పు కలిగించేలా ఉన్న అనుమతిప్రాప్త కేబుళ్లను కూడా తొలగించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను సోమవారం వరకు వాయిదా వేసింది.

Donald Trump: అమెరికా వీసాలపై భారీ సమీక్ష – 5.5 కోట్ల మందికి షాక్

అమెరికా ప్రభుత్వం వలస విధానాలపై మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను సమీక్ష చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ప్రక్రియలో ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, వారి వీసా తక్షణమే రద్దు చేసి, అమెరికాలో ఉంటే దేశ బహిష్కరణ చేస్తామని స్పష్టం చేసింది. వీసాదారుల ప్రవర్తన, సోషల్ మీడియా రికార్డులు, నేర చరిత్ర, ఉగ్రవాద సంబంధాలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలోనే ఉండిపోవడం, నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే చర్యలు ప్రధాన పరిశీలన అంశాలుగా పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీసాల రద్దు రేటు గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువ వీసాలను రద్దు చేశామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థి వీసాల రద్దు సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఇప్పటివరకు 6,000కి పైగా విద్యార్థి వీసాలను రద్దు చేసినట్లు వెల్లడించారు.

ఇస్రో మరో సంచలనం – భారత స్పేస్ స్టేషన్ నమూనా ఆవిష్కరణ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో భారత సొంత భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌ (BAS) నమూనాను తొలిసారిగా ఆవిష్కరించింది. ఇస్రో ప్రణాళికల ప్రకారం 2028 నాటికి తొలి మాడ్యూల్ BAS-01ను ప్రయోగించనున్నారు. 2035 నాటికి మొత్తం ఐదు మాడ్యూళ్లతో పూర్తిస్థాయి స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు సాకారం అయితే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS), చైనా తియాంగాంగ్ తర్వాత సొంత స్పేస్ స్టేషన్ కలిగిన మూడో దేశంగా భారత్ నిలవనుంది.

ఆవిష్కరించిన BAS-01 మాడ్యూల్ దాదాపు 10 టన్నుల బరువు కలిగి, భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో పరిభ్రమించనుంది. పర్యావరణ నియంత్రణ, జీవనాధార వ్యవస్థ, డాకింగ్ సిస్టమ్, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఈ స్పేస్ స్టేషన్ ప్రధానంగా సూక్ష్మ గురుత్వాకర్షణ (Microgravity) పరిశోధనలకు వేదికగా నిలుస్తుంది. అంతరిక్ష శాస్త్రాలు, జీవశాస్త్రాలు, వైద్య రంగంలో కీలక ప్రయోగాలకు తోడ్పడటమే కాకుండా, భవిష్యత్తులో చేపట్టబోయే దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలకు అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది కీలకంగా మారనుంది. వ్యోమగాముల కోసం స్పేస్‌వాక్ సదుపాయాలు, రేడియేషన్‌ నుంచి రక్షణ, ఇంధన నింపుకునే సామర్థ్యం వంటి అనేక ఫీచర్లను కలిగి ఉండడం దీని ప్రత్యేకత.

APMega DSC: ఏపీ డీఎస్సీ 2025 మెరిట్ లిస్ట్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ మెగా డీఎస్సీ 2025 మెరిట్ జాబితాను అధికారులు శుక్రవారం రాత్రి అధికారికంగా విడుదల చేశారు. అభ్యర్థులు తమ వివరాలను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలియజేశారు. అనధికారిక సమాచారం లేదా వదంతులను నమ్మకుండా కేవలం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని స్పష్టీకరించారు. మెరిట్ జాబితాలో ఎంపికైన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్లు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కాల్ లెటర్లు అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా అందుబాటులో ఉంటాయి. వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారు అన్ని ఒరిజినల్ ధృవపత్రాలు, ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి సంతకంతో మూడు సెట్‌ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. అలాగే ముందుగానే వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. నిర్ణీత సమయంలో వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి లేదా సరైన పత్రాలు సమర్పించని వారికి మరో అవకాశం ఉండదని, అటువంటి సందర్భాల్లో మెరిట్ జాబితాలోని తర్వాతి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని అధికారులు తేల్చి చెప్పారు.

మహిళల వన్డే వర్డల్ కప్ లో కీలక పరిణామం.. చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ లు రద్దు..

Women’s ODI World Cup 2025: భారత్–శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్కప్ 2025 షెడ్యూల్‌లో ఐసీసీ కీలక మార్పులు చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన 5 మ్యాచ్‌లను భద్రతా కారణాల వల్ల రద్దు చేసింది. ఈ మ్యాచ్‌ల్లో భారత్ జట్టు ఆడాల్సిన ప్రారంభ మ్యాచ్, ఒక లీగ్ మ్యాచ్, సెమీ ఫైనల్స్, పాకిస్థాన్ ఫైనల్‌కి చేరుకోకపోతే జరగాల్సిన ఫైనల్ కూడా ఉన్నాయి. వీటిని రీ-షెడ్యూల్ చేసి, కొత్త వేదికను శుక్రవారం ప్రకటించారు.

ఈ మ్యాచ్‌లన్నీ ఇప్పుడు నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియానికి మార్చినట్లు ఐసీసీ ప్రకటించింది. మ్యాచ్ తేదీలు, ప్రత్యర్థులు యథాతథంగా ఉంటాయి. వేదిక మాత్రమే మారుతుంది. ఒకవేళ పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో జరుగుతుంది. లేదంటే ఫైనల్ మ్యాచ్ కూడా డివై పాటిల్‌లోనే జరగనుంది. ఈ వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం ఇస్తున్న ఇతర వేదికల్లో గువహాటి ACA స్టేడియం, ఇందౌర్ హోల్కర్ స్టేడియం, విశాఖపట్టణంలోని ACA-VDCA స్టేడియం, శ్రీలంకలోని ఆర్.ప్రేమదాస స్టేడియం ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?
Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్