
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) సినీయర్ నాయకులు, తెలంగాణ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొంతకాలంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ(శుక్రవారం) ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా క్షీణించి తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి సురవరం సుధాకర్ రెడ్డి స్వగ్రామం. సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో 1942 మార్చి 25న జన్మించారు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి. సుధాకర్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మహబూబ్ నగర్ లోనే సాగింది... ఉన్నత విద్యాభ్యాసం మాత్రం వేరువేరు ప్రాంతాల్లో సాగింది. డిగ్రీ ఉస్మానియా కాలేజీ, కర్నూల్ లో చేశారు... అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి పూర్తిచేశారు.
సురవరం సుధాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మి. వీరికి ఇద్దరు కొడుకులు సంతానం. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్లో చేర్చారు... అక్కడే చికిత్సపొందుతూ ప్రాణాలు వదిలారు.
విద్యార్థి దశనుండే వామపక్ష భావజాలానికి ఆకర్షితులయ్యారు సురవరం సుధాకర్ రెడ్డి. ఇలా విద్యార్థి ఉద్యమాల నుండి మెల్లిగా రాజకీయాలవైపు వచ్చిన ఆయన 1998లో మొదటిసారి నల్గొండ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి అంటే 2004 లో కూడా ఆయన ఇదేస్థానం నుండి ఎంపీగా గెలిచారు.
ఇక సిపిఐ కార్యదర్శిగా, సిపిఐ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు సుధాకర్ రెడ్డి. ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అనేక పదవుల్లో పనిచేశారు. సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై సిపిఐ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.