వివాహిత అశ్లీల ఫోటోలతో బ్లాక్ మెయిల్... హైదరాబాద్ లో లోన్ యాప్ ఆగడాలు

By Arun Kumar P  |  First Published Jun 16, 2023, 12:45 PM IST

ఆన్ లైన్ లోన్ యాప్ ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ వివాహితను మార్పింగ్ ఫోటోలతో బెదిరిస్తున్న ఘటన వెలుగుచూసింది. 


హైదరాబాద్ : ఆన్ లైన్ లోన్ యాప్స్ సిబ్బంది మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక అవసరాలతో లోన్ యాప్స్ ను ఆశ్రయించిన పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే లోన్ యాప్ వేధింపులు భరించలేక తెలుగురాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు చోటుచేసుకున్నారు. అయినా లోన్ యాప్స్ తీరులో ఏమాత్రం మార్పులేదు. తాజాగా ఓ వివాహిత ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చిన లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు దిగిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. 

బాధిత మహిళ, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ శ్రీకృష్ణనగర్ కాలనీకి చెందిన ఓ వివాహిత ఆర్థిక అవసరాల కోసం ఆన్ లైన్ లోన్ యాప్ ను ఆశ్రయించింది. ఈ నెల 9న ఓ యాప్ ద్వారా రూ.5 వేల రుణం తీసుకుంది. 15వ తేదీ లోగా ఈ మొత్తం తిరిగి చెల్లించాల్సి వుండగా ముందురోజే (జూలై 14న) మొత్తం డబ్బులు చెల్లించింది. అయినప్పటికి ఆమెకు లోన్ యాప్ సిబ్బంది వేధింపులు తప్పలేదు. 

Latest Videos

వివాహితకు లోన్ యాప్ సిబ్బంది ఒకరు ఫోన్ చేసి రుణంగా తీసుకున్న డబ్బులు చెల్లించాలని కోరాడు. దీంతో డబ్బులు కట్టినట్లు మహిళ తెలపగా తమకు అందలేదని తెలిపాడు. ఈ విషయంలో లోన్ యాప్ సిబ్బంది, మహిళకు మధ్య వాగ్వాదం జరిగింది. ఫోన్ మాట్లాడిన కొద్దిసేపటికే మహిళ వాట్సాప్ నంబర్ కు ఓ ఫోటో వచ్చింది. వివాహిత ఫోటోను మార్పింగ్ చేసి అశ్లీలంగా మార్చి పంపించారు లోన్ యాప్ సిబ్బంది. వెంటనే డబ్బులు చెల్లించాలని... లేదంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారు.  

Read More  అప్సర హత్య కేసు: సాయికృష్ణతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు

మార్పింగ్ ఫోటోలు చూసి కంగారుపడిపోయిన మహిళ విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో భార్యాభర్తలిద్దరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లోన్ యాప్ వేధింపులపై ఫిర్యాదుచేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇలా ఇటీవల కాలంలో మార్పింగ్ ఫోటోలతో లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువయ్యాయి. లోన్ ఇచ్చే సమయంలో పూర్తి వివరాలు సేకరించి సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా పోటోలను సేకరిస్తోంది. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చి వేధింపులకు దిగుతుంది. ఈ వేధింపులు భరించలేక కొందరు పోలీసులను ఆశ్రయిస్తే మరికొందరు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. 

ఇలా లోన్ యాప్ అశ్లీల ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయడంతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని భాస్కరనగర్‌లో నివాసం ఉండే హరికృష్ణ బీటెక్ చదువేవాడు.అయితే అవసరం  నిమిత్తం హరికృష్ణ ఈ ఏడాది జనవరిలో పెపీ అనే లోన్‌యాప్‌ ద్వారా కొంత రుణం తీసుకున్నాడు. టైమ్‌కు డబ్బులు చెల్లించినా కూడా ఇంకా నగదు చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు ఒత్తిడి తీసుకొచ్చారు. లేకుంటే నగ్నఫొటోలు బంధువులు, స్నేహితులకు పంపడమే కాదు సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.  


 

click me!