నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు అవసరం లేదు: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం

By Sumanth KanukulaFirst Published Jan 25, 2022, 12:58 PM IST
Highlights

తెలంగాణలో (Telangana) నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు విధించేంతంగా కరోనా తీవ్రత లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు (Telangana High Court) మంగళవారం విచారణ చేపట్టింది. 

తెలంగాణలో (Telangana) నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు విధించేంతంగా కరోనా తీవ్రత లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు (Telangana High Court) మంగళవారం విచారణ చేపట్టింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను మరోసారి విచారించింది. అయితే గత విచారణలో.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఆర్‌టీపీసీఆర్‌ పరీ క్షలను పెంచాలని, రోజుకు లక్ష పరీక్షలు నిర్వ హించాలని తేల్చిచెప్పింది. ప్రజలు గుమిగూడ కుండా చూడాలని, ప్రజలు భౌతికదూరం పాటించేలా, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకన్న చర్యలను సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. 

ఈ క్రమంలోనే  Telangana Government హైకోర్టులో నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో కరోనా Night Curfew విధించే అంతగా తీవ్రంగా లేదని తెలిపింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని చెప్పింది. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉన్నట్టుగా తెలిపింది. ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10 శాతం మించలేదని పేర్కొంది. జీహెచ్‌ఎంసీలో 4.26 శాతం, మేడ్చల్‌లో 4.22 శాతం పాజిటివిటీ రేట్ ఉందని నివేదికలో పేర్కొంది. మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం పాజిటివిటీ రేటు, కొత్తగూడెంలో అత్యల్పంగా 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది. 

జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు విధించినట్టు ప్రభుత్వం తెలిపింది. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్ సర్వే జరుగుతోంది. మూడ్రోజుల్లో లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామని వెల్లడించింది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేశామని పేర్కొంది. 18 ఏళ్లలోపు వారిలో 59 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా తెలిపింది. రాష్ట్రంలో 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు పూర్తైందని తెలిపింది.

అయితే ప్రభుత్వం తప్పుడు గణంకాలను సమర్పిస్తోందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వ కిట్‌లో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవని అన్నారు. 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులు గుర్తించారని.. ఇది రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శమని చెప్పారు. దీనిపై స్పందించిన ఏజీ ప్రసాద్.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలోనే స్పందించిన న్యాయస్థానం.. మాస్కులు, భౌతిక దూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై డీహెచ్ తప్పనిసరిగా తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. 

click me!