రేపు టెన్త్ క్లాస్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఈ విషయంలో విద్యార్ధులు ఆందోళన చెందవద్దని విద్యాశాఖ కోరింది.
హైదరాబాద్: రేపు పదో తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.దేవసేన ప్రకటించారు. తాండూరు ప్రభుత్వ స్కూల్ నుండి పరీక్ష ప్రారంభమైన తర్వాత వాట్సాప్ లో పేపర్ బయటకు వచ్చినట్టుగా విచారణలో తేలిందని ఆమె తెలిపారు. వాట్సాప్ లో పేపర్ బయటకు వచ్చిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకున్నామని దేవసేన తెలిపారు.
also read:తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ప్రచారం:ఎస్ఎస్‌సీ బోర్డు వద్ద ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన, ఉద్రిక్తత
ఈ ఘటనలో నలుగరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చెప్పారు. విద్యార్ధులు, పేరేంట్స్ ఆందోళన చెందవద్దని కూడా ఆమె కోరారు. తాండూర్ పరీక్షా కేంద్రం నుండి పేపర్ బయటకు వెళ్లిన అంశంపై చీఫ్ సూపరింటెండ్ శివకుమార్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గోపాల్, ఇన్విజిలెటర్లు బందెప్ప, సమ్మప్పలను సస్పెండ్ చేసినట్టుగా దేవసేన వివరించారు.పరీక్ష ప్రారంభమయ్యాక బందెప్ప ప్రశ్నాపత్రం ఫోటో తీశారన్నారు. ఉదయం 9:37 గంటలకు బందెప్ప వాట్సాప్ లో పంపారన్నారు.. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని ఆమె వివరించారు. నిందితులు మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించారని విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఇదే సమయంలో టెన్త్ క్లాస్ పేపర్ లీకైందనే ప్రచారం కూడా కలకలం రేపుతుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత వాట్సాప్ లో పేపర్ బయటకు వచ్చిందని అధికారులు గుర్తించారు. తాండూరు ప్రభుత్వ స్కూల్ నుండి పేపర్ బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. మాల్ ప్రాక్టీస్ కోసం పేపర్ బయటకు వచ్చిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.