కూల్ రూఫ్ పాలసీని ఆవిష్కరించిన కేటీఆర్.. ఆ భవనాలకు తప్పనిసరి చేస్తామని వెల్లడి..

Published : Apr 03, 2023, 05:34 PM IST
కూల్ రూఫ్ పాలసీని ఆవిష్కరించిన కేటీఆర్.. ఆ భవనాలకు తప్పనిసరి చేస్తామని వెల్లడి..

సారాంశం

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ రూఫ్‌ పాలసీని తీసుకొస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌: దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ రూఫ్‌ పాలసీని తీసుకొస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని.. ఆ ప్రభావం నుంచి నుంచి తప్పించుకోవడానికి కూల్ రూఫ్ ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో కూల్ రూఫ్ పాలసీని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ సోమవారం అవతరించింది. తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీ 2023-28ని మంత్రి కేటీఆర్‌ ఈరోజు ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కూల్‌ రూఫ్‌ వల్ల కరెంటు చార్జీలు ఆదా అవుతాయని చెప్పారు. ఇప్పటికే కట్టిన భవనాలపై కూడా కూల్‌ రూఫ్‌ విధానం అమలుచేయొచ్చని వెల్లడించారు. 

‘‘నా ఇంటికి కూల్ రూఫ్ పెయింటింగ్ వేశాం. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంది’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు, హైదరాబాద్ ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇది మంచి విధానమని.. అయితే సమర్థవంతమైన అమలుకు స్వీయ నియంత్రణ కీలక అంశం అని మంత్రి పేర్కొన్నారు. కూల్ రూఫ్ పెయింటింగ్ లేదా టైల్స్ చదరపు మీటరుకు రూ. 300 మాత్రమే ఖర్చు అవుతుందని అన్నారు. 

దీర్ఘకాలంలో ఓఆర్‌ఆర్ ప్రాంతంలో దాదాపు 20 శాతం ప్రాంతంలో పాలసీని నిరంతరం అమలు చేయాలన్నదే లక్ష్యమని కేటీఆర్ అన్నారు. హౌసింగ్ బోర్డు పథకాలు, రాబోయే సోలార్ ప్యానల్ సైక్లింగ్ ట్రాక్‌తో సహా ప్రభుత్వం అన్ని పథకాలలో ఈ విధానం మరింతగా అమలు చేయబడుతుందని తెలిపారు. 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న అన్ని నివాస భవనాల్లో ఈ పథకం కింద ‘ఆక్యుపెన్సీ సర్టిఫికేట్’ తప్పనిసరి చేస్తామని కేటీఆర్ తెలిపారు.

2028-29 నాటికి హైదరాబాద్‌లో కూల్ రూఫ్ ఏరియా కింద 200 చదరపు కిలోమీటర్లు, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం  లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్‌ రూఫ్‌ ఏర్పాటును తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కూల్ రూఫ్ పాలసీ మార్గదర్శకాలను పాటించేలా బిల్డర్లు, ప్రాపర్టీ యజమానులను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను అందించడాన్ని అన్వేషించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ఇక, సైట్ విస్తీర్ణం లేదా నిర్మించిన ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ, వాణిజ్య భవనాలకు ఇప్పుడు కూల్ రూఫ్ తప్పనిసరి చేయనున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పాలసీకి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే జారీ చేయబడతాయి. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన నివాస భవనాల కోసం కూల్ రూఫ్ అప్లికేషన్ తప్పనిసరి చేస్తారు. 600 చదరపు గజాల కంటే తక్కువ ప్లాట్ ఏరియా ఉన్న నివాస భవనాలకు ఇది తప్పనిసరి కాదు. వారు ఐచ్చికంగా దీనిని ఎంపిక చేసుకోవచ్చు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు