
వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకే తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు దోస్తీ చేసిన తెలుగుదేశం పార్టీకి రాం రాం చెప్పేందుకు సమాయత్తమవుతోంది.
ఇటీవల భద్రాచలంలో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో ఈ విషయంపైనే ఎక్కువ చర్చ జరిగినట్లు తెలసింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లకు పోటీ చేసేలా ప్రణాళికలను రూపొందించాలని జాతీయనాయకత్వం దిశానిర్దేశం చేసిన తరుణంలో ఒంటరిపోరుతో తెలంగాణలో బలం పెంచుకునేందుకు తెలంగాణ కమలనాథులు సిద్ధమవతున్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తే తెలంగాణలో తమ పార్టీకి ఇప్పుడున్న సిట్టింగ్ స్థానాలు కూడా దక్కవనే అభిప్రాయం మెజార్టీ నేతల్లో వ్యక్తం అవుతుండటం వల్లే ఒంటరి పోరు మంచిదనే నిర్ణయానికి రాష్ట్ర పార్టీ వచ్చినట్లు సమాచారం.
త్వరలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఫలితాలు వచ్చే వరకు వేచి చూసి ఆ తర్వాత టీడీపీతో బంధం తెంచుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.
ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో పార్టీ గెలుపొందితే ఇక తెలంగాణలోనే కాదు ఏపీలోనే ఒంటరి పోరుకే జై కొట్టాలనేది వారి ఎత్తుగడ.
గత ఎన్నికల్లో టీడీపీతో జతకట్టినా తెలంగాణ బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు కొల్లగొట్టలేదు. తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలిపి, రాజ్యసభ, లోక్ సభలో కూడా బిల్లు పాసైయేందుకు కృషి చేసినా తమకు తెలంగాణలో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడానికి టీడీపీతో కలసి పోటీ చేయడమే కారణమని కలమనాథుల అభిప్రాయం.
అప్పట్లో టీఆర్ఎస్ తో ఎన్నికలు వెళ్లాలని తెలంగాణ బీజేపీ నేతలు పట్టుబట్టినా అధిష్టానం మాత్రం చంద్రబాబు వైపే మొగ్గు చూపింది.దీంతో తెలంగాణలో కమలం పూర్తిగా వికసించలేకపోయింది. ఇప్పుడు అదే తప్పు చేసి పార్టీని ప్రజల నుంచి దూరం చేసుకోవద్దని కమలనాథులు భావిస్తున్నారు. ఈ సారి అధిష్టానంను ఎలాగైనా ఒప్పించి ఒంటరి పోరుతో బరిలోకి దిగాలని నిర్ణయించారు. అది కూడా యూపీలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే వెంటనే టీడీపీకి కటీఫ్ చెప్పాలని భావిస్తున్నారు.
అయితే ఇప్పటికే తెలంగాణ లో టీడీపీ కి బీజేపీ దూరంగానే ఉంటుంది. పేరుకు మిత్రపక్షమైనా ఎక్కడా రెండు పార్టీల నేతలు కలసి ప్రభుత్వంపై పోరాడటం లేదు.