
స్వామి భక్తిని ప్రదర్శించడానికి తెలంగాణ కలెక్టర్లు పోటీ పడుతున్నారు. సీఎం కూతురు ముందు ఒక ఐఏఎస్ మోకరిళ్లి తన విధేయతను ప్రదర్శిస్తే... మరో కలెక్టర్ తానేమీ తక్కువ తినలేదని ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసేందుకు తహతహలాడుతున్నారు.
భారత గణతంత్ర్య దినోవత్సవం నాడు ఇలా ఇద్దరు ఐఏఎస్ లు తమ సివిల్ సర్వీస్ తెలివితేటలను ప్రజలందరి ముందు ప్రదర్శించడం ప్రజలకు చిరాకు తెప్పించింది. సివిల్స్ సర్వీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా వారి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఐఏఎస్ ల తీరు... నాయకుల పాదాలకు మోకరిళ్ళే చూడు..అంటూ నెటిజన్లు పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతన్నాయి.
‘ జగిత్యాల జిల్లా ఏర్పాటు అనంతరం మొట్ట మొదటి సారిగా 68 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల చారిత్రక ఖిల్లా లో గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ప్రసంగం ప్రారంభించడం ప్రజల్లో కలకలం రేపింది.
మరో ఐఏఎస్ అధికారి మూష్రప్ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత వద్దకువెళ్లి ఆమె పాదాల వద్ద కూర్చుని ముచ్చటించడం పరేడ్ మైదానం లో కూర్చున్న పలువురిని తలవంపులకు గురి చేసింది.
అఖిల భారత సర్వీసుఅధికారులుగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వీరు వ్యవహరించిన తీరు జగిత్యాల జిల్లా యవనిక పై మాయని మచ్చకు గురిచేసింది.’
రేయింబగళ్లు కష్టపడి లక్షలమంది అభ్యర్థులతో పోటీ పడి సివిల్స్ లో నెగ్గిన వారు తీరా సర్వీసులోకి వచ్చాక ఇలా వ్యవహరిస్తుండటం సరికాదు... అలా అని అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారనడం కూడా తప్పే.
గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ కు చెమటలు పట్టించిన దుర్గాశక్తి నాగ్ పాల్ కూడా సివిల్ సర్వెంటే. సీఎం ఆగ్రహానికి గురై సస్పెండ్ అయినా తన పోరాటాన్ని ఆపలేదు. తప్పుచేసిన వారు ఎంతటి వారైనా శిక్షించకుండా వదలలేదు.