హైదరాబాద్ లో విషాద ఘటన వెలుగు చూసింది. పెళ్లైన 15 రోజులకే ఓ నవవధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారి వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పేట్ బషీరాబాద్ : తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలోని బాపూనగర్లో విషాద ఘటన వెలుగు చూసింది. నితీష(25) అనే నవవధువు పుట్టింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, నితీషకు 15 రోజుల క్రితమే వివాహం అయ్యింది. సంతోష్ రెడ్డి అనే వ్యక్తితో పదిహేను రోజుల క్రితమేపెద్దలు వివాహం జరిపించారు. అత్తింటి నుంచి గురువారం రాత్రి పుట్టింటికి వచ్చిన నితీష.. రాత్రి 11 గంటల సమయంలో చీరతో ఉరి వేసుకుని మృతి చెందింది.
అయితే, ఆమె మృతికి అత్తింటి వారి వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నవవధువు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదు మేరకు ఫేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాళ్ల పారాణి కూడా ఆరకముందే నవవధువు మృతి చెందడంతో.. కుటుంబంతో పాటు స్థానికంగా విషాదఛాయలు అమ్ముకున్నాయి.
నార్సింగిలో ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి…
ఇదిలా ఉండగా, వరకట్న వేధింపులకు మరో వివాహిత బలయింది.. అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధించడంతో భూక్యా మౌనిక (28) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం వరంగల్ జిల్లాలోని పకీర్ తండాలో వెలుగు చూసింది. స్థానిక ఎస్సై మంగీలాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భూక్యా వెంకన్న, బుల్లి దంపతుల కొడుకు రాంబాబు. వీరు మానుకోట జిల్లా నరసింహులపేట మండలం పకీరతండాలో ఉంటారు.
రాంబాబుకు 11యేళ్ల క్రితం బయ్యారం మండలం చోక్లాతండాకు చెందిన మౌనికతో వివాహం అయ్యింది, కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత అదనపు కట్నపు వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టడంతో వాటిని తట్టుకోలేని మౌనిక.. తీవ్ర మనస్థాపానికి గురై.. ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్ నగర్ ఏరియా ఆసుపత్రికి మౌనికను తరలించారు.
ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే మౌనిక మృతి చెందింది. మౌనిక, రాంబాబు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మౌనిక మృతికి భర్త, అత్తామామలే కారణమంటూ మౌనిక తండ్రి తేజావత్ హుస్సేన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మరోవైపు మృతురాలి తలపై బలమైన గాయం ఉందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తీవ్ర రక్తస్రావం జరిగిందని కూడా చెబుతున్నారు. మౌనికది హత్య అని.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.