హోంగార్డులను బెదిరించిన హోంమంత్రి నాయిని

First Published Jul 11, 2017, 7:58 AM IST
Highlights

హోంగార్డులకు జీతాలు పెంచినం. మంచిగ పనిచేయాలె. రాజకీయాలు చేయోద్దు. ధర్నాలు, ఆందోళనలు చెయ్యోద్దు. పోలీసు శాఖ అంటే క్రమశిక్షణతోటి ఉండాలె. మీరు రాజకీయాలు చేస్తే మీ ఉద్యోగాల పర్మినెంట్ అనే ముచ్చట మరచిపోవాలె. జాగ్రత్త.

తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హోంగార్డులను బెదిరించారు. ఎక్కువ తక్కువ చేస్తే మీ ఉద్యోగాలను పర్మినెంట్ చేసే ప్రసక్తే లేదని తేల్చి పారేశారు. హోంమంత్రికి హోంగార్డుల మీద అంత కోపమెందుకొచ్చిందా అని పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

 

సోమవారం మహబూబ్ నగర్ లోని కొత్త ఎస్పీ కార్యాలయాన్ని డిజిపి అనురాగ్ శర్మతో కలిసి ప్రారంభించారు హోంమంత్రి నాయిని. అనంతరం జరిగిన సభలో ఆయన హోంగార్డుల క్రమశిక్షణ మీద గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ధర్నాలు, ర్యాలీలు చేస్తే హోంగార్డులను పర్మినెంట్ చేసే విషయం మరచిపోతేనే మంచిదన్నారు.

 

పర్మినెంట్ చేయాలంటే అనేక సమస్యలున్నాయని, వాటిపై పోలీసు శాఖలో చర్చిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు నాయిని. ఇటీవల కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తే అనేక సమస్యలు వచ్చయన్నారు. అందుకే హోంగార్డుల పర్మినెంట్ ఆలస్యమైనా సరే వారికి వేతనాలను 9వేల నుంచి 12వేలకు పెంచామన్నారు.

 

మొత్తానికి నిన్నమొన్నటి వరకు హోంగార్డులు తమ సమస్యలపై అప్పుడో ఇప్పుడో రోడ్డెక్కిన దాఖలాలున్నాయి. కానీ హోంమంత్రి బెదిరించడంతో వారు ఎలా స్పందిస్తారో మరి?

click me!