మరో వివాదంలో టిఎస్పిఎస్సీ

First Published Jul 10, 2017, 7:27 PM IST
Highlights

నిన్న మొన్నటి వరకు గ్రూప్స్ వివాదంలో పీకలలోతు వరకు కూరుకుపోయిన టిఎస్పిఎస్సీ కి మరో తలనొప్పి వచ్చి పడింది. గ్రూప్ 2 వివాదంపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. తాజాగా టెట్ పరీక్ష జరిగేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఆ వివాదాన్ని టిఎస్సిఎస్సీ ఎలా పరిష్కరిస్తుందన్నది చర్చనీయాంశమైంది.

టిఎస్సిఎస్సీ రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది. గ్రూప్స్ వివాదం ఇప్పుడు కోర్టులో ఉండగా గురుకుల మెయిన్స్ వాయిదా వేయాలన్న డిమాండ్ ఒకవైపు వినిపిస్తోంది. గురుకుల మెయిన్స్ కోసం 90రోజుల సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడిన వెంటనే సమయం ఇవ్వకుండా మెయిన్స్ జరుపుతున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా టెట్ పరీక్షను ఈనెల 23వ తేదీన ఖరారు చేసింది సర్కారు. టెట్ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే అదేరోజు వెటర్నరీ పోస్టుల కు పరీక్ష ఉందని అభ్యర్థులు అంటున్నారు. వందలాది మంది అభ్యర్థులు ఇటు టెట్ కు అటు వెటర్నరీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

 

 

టెట్ పరీక్ష కోసం నిరుద్యోగులు ఎన్నో ఆందోళనలు, ఎన్నో పోరాటాలు జరిపిన తర్వాత దిగివచ్చిన తెలంగాణ సర్కారు ఈనెల 23న టెట్ నిర్వహిస్తామని ప్రకటించిందన్నారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మందడి అనీల్ కుమార్ యాదవ్. కాబట్టి టెట్ వాయిదా వేయకుండా అదే రోజు జరపాలని ఆయన కోరారు. కొద్ది సంఖ్యలోనే అభ్యర్థులు ఉన్న వెటర్నరీ పోస్టుల పరీక్షను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు టిఎస్సీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపానికి వినతిపత్రం సమర్పించారు.

 

మరి టిఎస్సీఎస్సీ ఎలా స్పందిస్తుందో, ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

click me!