పొన్నాలకు కోమటిరెడ్డి పొగ

First Published Jul 10, 2017, 5:50 PM IST
Highlights

మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొగబెడుతున్నారా? పొన్నాల ఇలాకాలో పాగా వేసేందుకు రాజగోపాల్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నయి. మరి ఎందుకు పొన్నాలకు కోమటిరెడ్డి పొగ పెడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి.

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు పొన్నాల లక్ష్మయ్య. జనగామ నియోజకవర్గం నుంచి ఆయన గెలుస్తూ వచ్చారు. జనగామ ఆయన కంచుకోటా చెబుతుంటారు. గత ఎన్నికల్లో ఆయన తెలంగాణ పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉండి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయన స్థానంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టిఆర్ఎస్ తరుపున గెలుపొందారు.

 

2019 ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసేందుకు పొన్నాల ఉవ్విళ్లూరుతున్నారు. ఒకవైపు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీద నియోజకవర్గంలో వచ్చిన వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని పొన్నాల ప్లాన్ చేస్తున్నారు. ముత్తిరెడ్డి మీద సిఎం కెసిఆర్ కూడా గుర్రుగా ఉండడంతో తన గెలుపు నల్లేరు మీద నడకే అని పొన్నాల ఆశతో ఉన్నారు.

 

కానీ జనగామ నియోజకవర్గంపై మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నేశారు. ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ని అక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఇప్పటి నుంచే రాజగోపాల్ రెడ్డి పావులు కదుపుతున్నారు. జనగామ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో రాజగోపాల్ రెడ్డి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మీకు అండగా నేనుంటాను. వచ్చేసారి మనమే ఎమ్మెల్యే సీటును గెలుచుకుంటాం అని జనగామ మండల నేతలతో కోమటిరెడ్డి  చెప్పినట్లు తెలిసింది.

 

పొన్నాల లక్షయ్య జనగామలో పాతుకుపోయారని, ఆయన మీద జనాల్లో వ్యతిరేకత ఇంకా ఉందని జనగామ కాంగ్రెస్ నేతలు, కోమటిరెడ్డి మధ్య చర్చల సందర్భంగా అనుకున్నట్లు తెలిసింది. పొన్నాల ప్రతిష్ట రోజురోజుకూ మసకబారిపోతుందని అందుకే మనమే అక్కడ ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసి గెలుద్దాం అని కోమటిరెడ్డి పార్టీ నేతలతో అంటున్నారట.

 

రాజగోపాల రెడ్డి సతీమణి లక్ష్మి సొంత జిల్లా ఉమ్మడి వరంగల్. ప్రస్తుతం జిల్లాల విభజనలో ఆమె పుట్టినిల్లు ములుగు జిల్లాలో ఉంది. ములుగు రిజర్వుడు నియోజకవర్గం కాబట్టి ఆమెను జనగామ నుంచి ఎన్నికల బరిలోకి దింపే యోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. కోమటిరెడ్డి లక్ష్మి ఓరుగల్లు బిడ్డ కావడం తమకు కలిసి వచ్చే అంశమని వారు చర్చించుకుంటున్నారు.

 

అయితే మరి పొన్నాల విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ పొన్నాలను అక్కడి నుంచి కదిలిస్తే రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ లాంటి పోస్టులు ఏమైనా ఇస్తారా లేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణికి టికెట్ ఇస్తారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

click me!