
చెన్నమనేని రమేశ్ కుటుంబానికి మరో శుభవార్త చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ తొమ్మిదో ప్యాకేజీకి స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే , దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా గురువారం మల్కపేట జలాశయంతో పాటు పాటు ఆ పరిధిలోని కాల్వలకు ఆయన పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పరిధిలోని వేలాది ఎకరాలకు, లక్షలాది మందికి సాగు, తాగునీరు అందిస్తున్న మిడ్‌మానేరు నుంచి ఎగువ మానేరు వరకు రిజర్వాయర్, కాల్వలకు రాజేశ్వరరావు పేరు పెట్టనున్నారు.
ప్రజా ప్రతినిధిగా చెన్నమనేని సేవలందించిన ప్రాంతానికి కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ ద్వారా సాగునీరు అందుతోందని కేసీఆర్ తెలిపారు. రైతాంగం కోసం ఆ రోజుల్లోనే వరద కాల్వ, ఎత్తిపోతల పథకాల కోసం చెన్నమనేని రాజేశ్వరరావు పోరాడారని ఆయన పేర్కొన్నారు . స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ తొలి తరం రాజకీయ నాయకుడిగా ప్రజల కోసం పోరాడారని కేసీఆర్ ప్రశంసించారు. చెన్నమనేని రాజేశ్వరరావు ఆకాంక్షలు ఫలించేలా ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నామని ఆయన వెల్లడించారు.
ALso Read: కాంగ్రెస్, బీజేపీలకు చెక్.. కేసీఆర్ వ్యూహాత్మకం , చెన్నమనేని రమేష్‌కు నామినేటెడ్ పోస్ట్
కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటన బిఆర్ఎస్ లో కలకలం రేపింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కొందరు ఇప్పటికే బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇతర పార్టీలవైపు చూస్తుండగా మరికొందరు నాయకులు అదే బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోడానికి సిద్దమవుతున్నారు.
ఈ క్రమంలోనే వేములవాడ నుంచి పోటీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్‌కు ఈసారి టికెట్ నిరాకరించారు కేసీఆర్. ఆయనకు బదులుగా చల్మెడ నరసింహారావుకు అవకాశం కల్పించారు. దీంతో చెన్నమనేని అలకబూనారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్‌ను వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా చెన్నమనేని రమేష్‌కు నామినేటెడ్ పదవి కల్పించారు సీఎం కేసీఆర్. ఆయనను వ్యవసాయరంగ సలహాదారుగా నియమించారు. ఐదేళ్ల పాటు కేబినెట్ ర్యాంక్‌తో ఈ పదవిలో కొనసాగనున్నారు రమేష్.