తప్పించుకుని వెళ్తున్న కారును అడ్డగించిన నల్గొండ పోలీసులు.. సీటు కింద రూ. 3 కోట్ల నగదు..

By Sumanth Kanukula  |  First Published Oct 16, 2023, 9:58 AM IST

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.


తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలో ఓ కారులో రూ. 3 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించారు. దీంతో కారును సీజ్‌ చేయడంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..  ఆదివారం ఉదయం  5.30 గంటలకు మాడుగులపల్లి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు తప్పించుకుని అతివేగంగా మిర్యాలగూడ వైపు దూసుకెళ్లింది. 

టోల్ గేట్ సిబ్బంది మిర్యాలగూడ డీఎస్పీకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఈదులగూడ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును అడ్డగించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కారులోని వ్యక్తులు పోలీసుల నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించుకుంటున్నారని గ్రహించిన ఉన్నతాధికారులు అప్రమత్తమై అంతర్రాష్ట్ర సరిహద్దులు, చుట్టుపక్కల ఉన్న ఇతర చెక్‌పోస్టులకు సమాచారం అందించారు.

Latest Videos

ఈ క్రమంలోనే వాడపల్లి అంత ర్రాష్ట్ర సమీకృత చెక్‌పోస్టు దగ్గర పోలీసులు ఆ కారును పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా పోలీసులకు మొదట్లో ఏమీ దొరకలేదు. అయితే పోలీసులు నిశితంగా పరిశీలించగా.. సీటు కింద ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెలో రూ. 3 కోట్ల నగదును గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులోని ఇద్దరు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన  విపుల్‌ కుమార్‌ భాయ్‌, అమర్‌సింగ్‌ జాలాగా గుర్తించారు. తదుపరి విచారణ కోసం ఇద్దరు వ్యక్తులను నల్గొండకు తరలించారు. ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. నిందితులపై ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. .

click me!