తెలంగాణ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ నేత కుంజా సత్యవతి గుండెపోటుతో మృతి చెందారు. భద్రాచలం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు సత్యవతి.
కొత్తగూడెం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బిజెపిలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ బిజెపి నాయకురాలు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాత్తుగా మృతి చెందారు. సత్యవతికి ఆకస్మికంగా ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆమెను ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే కుంజా సత్యవతి మృతి చెందారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ విషాదకర ఘటన పట్ల బిజెపి నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఆదివారం రాత్రి తన నివాసంలోనే అకాల మృత్యువాత పడ్డారు. ఆమెకు ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఆ సమయంలో ఆమె తన నివాసంలోనే ఉన్నారు. ఇది కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగానే నిర్ధారించారు.
సత్యవతి హఠాత్ మరణం పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుంజా సత్యవతి సిపిఎం, కాంగ్రెస్, బిజెపిల్లో పనిచేశారు. సత్యవతి దంపతులు మొదట్లో సిపిఎం పార్టీలో పనిచేశారు. దివంగత వైయస్సార్ చరణలతో ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అలా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద భద్రాచలం నుంచి సత్యవతి గెలిచారు. వైయస్సార్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వేరే పార్టీల్లోకి మారుతూ చివరికి బిజెపిలో స్థిరపడ్డారు. తెలంగాణలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి ఆమెకు టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.