
తెలంగాణ కాంగ్రెస్‌లో వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు చేరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కొన్ని చోట్ల పార్టీలోని నేతల అసంతృప్తికి కారణం అవుతుంది. తాజాగా కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు పార్టీ కోసం పనిచేస్తుంటే సడన్‌గా జూపల్లి వచ్చాడని అన్నారు. జూపల్లి కృష్ణారావు వస్తే ఏదో జరిగిపోతుందని అంటున్నారని.. కానీ ఆయనతో ఏమీ కాదని చెప్పుకొచ్చారు.
జూపల్లికి నాగర్ కర్నూలు, గద్వాల్, కొల్లాపూర్, వనపర్తి సీట్లు కావాలంట అంటూ ఎద్దేవా చేశారు. జూపల్లి అంత పెద్దోడు ఎప్పుడయ్యాడో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఎవరో వస్తే ఏం జరగదని.. ప్రజల్లో ఉండాలని చెప్పారు. ఇక్కడ గెలిచినోడు ఇక్కడే ఉంటాడని గ్యారంటీ ఉందా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో పెట్టాల్సిన కాగ్ రిపోర్టును సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని నాగం జనార్థన్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత భారీ కుంభకోణం జరిగిన ప్రాజెక్టు అని ఆరోపించారు. 40శాతం అవినీతి జరిగిందని కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారని.. తెలంగాణలో 70-75 శాతం అవినీతి జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, బస్సులు అన్నీ మేఘా కృష్ణారెడ్డికే అప్పగించారని.. మేఘా కృష్ణారెడ్డి తెలంగాణకు క్యాన్సర్ కంటే ప్రమాదకారిగా మారారని విమర్శించారు.