రేపు చండూరులో లెఫ్ట్ పార్టీలు సభను నిర్వహించనున్నాయి.మునుగోడులోఉప ఎన్నికల్లో సీపీఐ,సీపీఎంలు టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటించాయి.
హైదరాబాద్:మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతుగా లెఫ్ట్ పార్టీలు సోమవారం నాడు సభను నిర్వహించనున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 3 వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉపఎన్నికను పురస్కరించుకొని లెఫ్ట్ పార్టీలు ఈ సభను ఏర్పాటు చేశాయి. మునుగోడు అసెంబ్లీ స్థానంలో లెఫ్ట్ పార్టీలకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు 12 దఫాలు ఎన్నికలు జరిగితే ఆరు దఫాలు కాంగ్రెస్ , ఐదు సార్లు సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని టీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు లెఫ్ట్ పార్టీలనుకోరాయి. ఈ ఏడాది ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో మునుగోడులో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై చర్చించారు. టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 20న మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర సమితి సహయ కార్యదర్శి పల్లావెంకట్ రెడ్డి ప్రకటించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది సీపీఎం., గత మాసంలో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎం నేతలు టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్టుగా ప్రకటించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంపై మంత్రి జగదీష్ రెడ్డి గత వారంలో సీపీఐ, సీపీఎం నేతలతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో అనుపరించాల్సిన ప్రచార వ్యూహంపై చర్చించారు.ఈసమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రేపు చండూరులో లెఫ్ట్ పార్టీలు సభను నిర్వహించనున్నాయి. ఈ సభలో సీపీఐ రాష్ట్ర సమితికార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శిచాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.
also read:మునుగోడులో 200 కార్లు, 2 వేల మోటారు బైక్ లు బీజేపీ బుక్ చేసింది: హరీష్ రావు సంచలనం
మునుగోడు అసెంబ్లీనియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలోని లెఫ్ట్ పార్టీల క్యాడర్ టీఆర్ఎస్ కు సహకరించేందుకు సిద్దంగా లేరని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. అయితే ఏ పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలనినిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని లెఫ్ట్ నేతలు మరోసారి వివరించనున్నారు. మునుగోడులో ఉన్న పరిస్థితులు రానున్నరోజుల్లో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలపై లెఫ్ట్ పార్టీలు తమ వైఖరిని ప్రకటించనున్నాయి.