మీటర్లు పెట్టాలని కేంద్రం బెదిరిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే రూ.30 వేల కోట్లు వదులుకున్నామని మంత్రి తెలిపారు.
మీటర్లు పెట్టాలని కేంద్రం బెదిరిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్‌పై కాంగ్రెస్ విధానం ఏంటో రాహుల్ స్పష్టం చేయాలన్నారు. 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏడాదికి 11 వేల కోట్లను ఉచిత విద్యుత్ కోసం ఖర్చు పెడుతున్నామని కేటీఆర్ తెలిపారు. ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రైతులపై కాంగ్రెస్‌కు ఎందుకంత కక్ష అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 70 లక్షల మంది రైతులను బిచ్చగాళ్లని రేవంత్ రెడ్డి అన్నారని.. కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా అనేది రైతులు ఆలోచన చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో బావి వద్ద నిద్రపోయిన రోజులను రైతులు గుర్తుచేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కోతలు లేని విద్యుత్ సరఫరా వుండేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ALso Read: తెలంగాణలో పింక్ వేవ్ ఒక్కటే .. రేవంత్, ఈటలకు వాతలు తప్పవు : కల్వకుంట్ల కవిత
రైతులకు ఉచిత కరెంట్ ఎందుకని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు బాగుపడుతున్నారని .. కాంగ్రెస్ నేతల తీరుతో రైతులు తిరిగి ఆగమవుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే రూ.30 వేల కోట్లు వదులుకున్నామని మంత్రి తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను మించి తెలంగాణ అగ్రస్థానంలో వుందని కేటీఆర్ చెప్పారు.