
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్ రెడ్డిపై ఎస్‌ఐ లోకేష్ చేయి చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేసిన ఎస్‌ఐ లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఎస్పీలను ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ రోజు సాయంత్రం వరకు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోకుంటే రేపు కోదాడలో దీక్ష చేపడతామని హెచ్చరించారు.
మ్మారెడ్డి గ్రామంలో అంబేడ్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఉన్నవారిని జైభీం అంటే అర్ధం చెప్పాలని వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఘర్షణ చోటుచేసుకుంది.
తనపై ఎస్‌ఐ లోకేష్, మిగతా పోలీసులు తనపై పిడిగుద్దులతో దాడి చేశారని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీటీసీ అని చెబుతున్న వినిపించుకోకుండా దాడికి దిగారని చెప్పారు. పోలీసుల దాడిలో కుడి కన్నుకు తీవ్ర గాయమైందని తెలిపారు.