
ఖమ్మం: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకు సమీపంలో గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. అందులో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడినవారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మరో ఆస్పత్రికి తరలించారు. అయితే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
అనంతరం ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకి 200 మీటర్ల దూరంలో ఒక సిలిండర్ పేలిందని అన్నారు. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి వెళ్లడంతో గాయపడ్డారని చెప్పారు. ఆ సమయంలో తాము స్టేజి మీద ఉన్నామని తెలిపారు. ఆరుగురు గాయపడినట్టుగా చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారని.. మరో ఇద్దరు వేరే ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు. వారిని కూడా చూడనున్నట్టుగా చెప్పారు. ఇద్దరు ముగ్గురికి కాళ్లు తెగినట్టుగా చెప్పారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు.
‘‘ఆస్పత్రిలో చేర్పించినవారికి చికిత్స అందిస్తున్నట్టుగా డాక్టర్లు చెప్పారు. ఒకరికి మాత్రం సీరియస్‌గా ఉందన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలిన చెప్పాను. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరం. గుడిసెలో ఉండే గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులను తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటాం. సిలిండర్ పేలడానికి, తమ మీటింగ్‌కు సంబంధం లేదు. 200 మీటర్ల దూరంలో ఘటన జరిగింది. అలా అని తాము పట్టించుకోమని కాదు’’ అని చెప్పారు.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతలు చీమలపాడుకు విచ్చేశారు. పార్టీ నేతల రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలో మంటల చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు గుడిసె వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో గుడిసెలో ఉన్న సిలిండ్ కూడా పేలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటనలో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడినవారిని పోలీసు వాహనాల్లోనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కొందరి కాళ్లు, చేతులు కూడా తెగిపడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక, ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాన్ని నిలిపివేశారు.
మరోవైపు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఖమ్మం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. గాయపడిన తమవారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.