
కరీంనగర్ : వరి, మొక్కజొన్నతో పాటు వివిధ రకాల పంటలను రైతులు రోడ్లపై ఆరబెడుతుంటారు. మరికొందరు రైతులయితే ఏకంగా రోడ్లపైనే పంట నూర్పిడి కూడా చేస్తుంటారు. ఇది తెలంగాణ రోడ్లపై ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా రోడ్లపైనే రైతులు ధాన్యం ఆరబెట్టడం, రాత్రి రోడ్డుపక్కన కుప్పలుగా పోయడం ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టకుండా రైతులతో పాటు ఆయా గ్రామాల సర్పంచులకు అవగాహన కల్పిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇలా తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వివిధ గ్రామాల సర్పంచులకు రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి రైతులను అవగాహన కల్పించాలని సూచించారు.
జమ్మికుంట పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులతో స్థానిక సీఐ రమేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరి, మొక్కజొన్న పంటల కోతలు మొదలైన నేపథ్యంలో రైతులు రోడ్లపై దాన్యాన్ని అరబెట్టకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ సర్పంచులపై వుందని సీఐ తెలిపారు. వరి ధాన్యం, మొక్కజొన్నలతో పాటు ఇతర పంటలు రోడ్లపై అరబెట్టడం ప్రమాదాలకు కారణమవుతోందని సీఐ ఆందోళన వ్యక్తం చేసారు.
వీడియో
రైతులు తమ పంటలను కల్లాలలో లేదా ప్రభుత్వం ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టుకోవాలని సీఐ సూచించారు. ఇకపై రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసే రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై ఆరబోసే ధాన్యం కారణంగా వాహనదారులు ప్రమాదానికి గురయితే రైతులపై కేసు పెట్టాల్సి వుంటుందన్నారు. ఒకవేళ ఇలాంటి ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే రైతులపై మర్డర్ కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. కోర్టుల్లో కూడా ఈజీగా నేర నిర్దారణ జరిగి రైతులకు శిక్ష పడే అవకాశాలుంటాయని సీఐ హెచ్చరించారు. ఈ విషయాలు తెలియక రైతులు ధాన్యాన్ని రోడ్లపై అరబెడుతుంటారని... వారికి అవగాహన కల్పించాలని సర్పంచులకు సీఐ సూచించారు.
మనిషి ప్రాణం చాలా విలువైనది... అన్నదాతల వల్ల ఎవ్వరూ ప్రాణాలు కోల్పోవద్దని సీఐ అన్నారు. కాబట్టి రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టుకోవద్దని ఆయా గ్రామాల్లో చాటింపు వేయించాలని సర్పంచులకు సూచించారు. అలాగే రైతులతో సర్పంచులు స్వయంగా సమావేశమై ధాన్యం రోడ్లపై ఆరబెట్టడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసులు వచ్చి రైతులపై కేసులు నమోదు చేసే పరిస్థితి కల్పించవద్దని సీఐ రమేష్ సర్పంచులను కోరారు.