
Telangana: ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమైన మంకీపాక్స్ కేసులు ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలకు వ్యాపించాయి. పలు దేశాల్లో అందోళనకరంగా మంకీపాక్స్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మంకీపాక్స్ పై పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక భారత్ లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశీ ప్రయాణాలపై నిఘా పెంచారు. తెలంగాణ ప్రభుత్వం సైతం మంకీపాక్స్ విషయంలో అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. రోగుల కోసం ప్రత్యేక వార్డులను కేటాయిస్తున్నారు. ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ క్రమంలోనే ఇటీవలి విదేశీ ప్రయాణ చరిత్ర కలిగిన ఖమ్మం జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసును గుర్తించారు. సదరు వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణలు గుర్తించారు. అధికారులకు ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి నమూనాను బుధవారం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) పూణేకు పంపించారు. తెలంగాణలో మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి ఇది రెండో అనుమానిత కేసు ఇది. ఇంతకుముందే మొదటి అనుమానిత మంకీపాక్స్ రోగిని కామారెడ్డిలో గుర్తించారు. 40 ఏళ్ల ఆ వ్యక్తి నుండి సేకరించిన నమూనాలు పరిశీలించగా మంగళవారం నెగిటివ్‌గా తేలింది. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ "మంకీపాక్స్ వ్యాధి పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపిన శాంపిల్స్ నెగెటివ్‌గా ఉన్నట్లు తేలిందని" తెలిపారు. మంకీపాక్స్ కు సంబంధించిన ప్రతి అనుమానిత కేసులోనూ, గొంతు, రక్తం, మూత్రం, చర్మంపై గాయాల నుంచి మొత్తం ఐదు రకాల నమూనాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు.
ఏంటీ ఈ మంకీపాక్స్? అది ఎలా వ్యాపిస్తుంది?
మంకీపాక్స్ వ్యాధి ఇటీవల గుర్తించిన కొత్తదేమీ కాదు. చాలా కాలం క్రితమే ఇది వెలుగులోకి వచ్చినప్పటికీ.. కేవలం ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాలకు పాకింది. పలు దేశాల్లో ఆందోళనకర స్థాయిలో మంకీపాక్స్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 16,000 వేలకు పైగా కేసులు గుర్తించారు. కరోనా మహమ్మారి, పోలియో వంటి అంతర్జాతీయ ఆందోళనల తర్వాత మంకీపాక్స్ ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రకటించింది.
మంకీపాక్స్ వైరస్ సాధారణంగా మొటిమలు, పొక్కు వంటి గాయాలు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలను కలిగిస్తుంది. ముఖ్యంగా చర్మంపై పెద్దమొత్తంలో గాయాలు కావడానికి దారితీస్తుంది. ఇది చర్మం లేదా గాయాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవుని నుండి మానవునికి సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మంకీపాక్స్ వ్యాప్తికి కారణం లైంగిక సంబంధాలని నిపుణులు పేర్కొంటున్నారు. లైంగిక కార్యకలాపాల వల్ల కూడా వ్యాధి సంక్రమించిన కేసులు నమోదయ్యాయని పలు దేశాలు గుర్తించాయి. మంకీపాక్స్ బారినపడ్డవారిలో చాలా మంది ఎలాంటి చికిత్స తీసుకోకుండానే నాలుగైదు వారాల్లో కోలుకుంటారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.