MLC Kavitha: లండన్‌లో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటాను చేర్చే వరకు తన పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో భారతదేశ మహిళలకు భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత (MLC Kavitha) అన్నారు. విప్లవాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కువ మంది మహిళలు చట్టసభల్లో ప్రవేశించేందుకు మార్గం సుగమం చేస్తుందని ఆమె అన్నారు. భారత పార్లమెంటులో ప్రస్తుతం 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారనీ, ఈ విప్లవాత్మక బిల్లుతో ఆ సంఖ్య 181కి చేరుకుంటుందని పేర్కొన్నారు.1996లో దేవెగౌడ ప్రభుత్వం కృషి చేసినందుకు, 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత లండన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ పబ్లిక్ పాలసీ ఆర్గనైజేషన్ బ్రిడ్జ్ ఇండియా లండన్‌లో "మహిళా రిజర్వేషన్ - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం" అనే అంశంపై నిర్వహించిన సదస్సు పాల్గొన్నారు. ఈ సదస్సులో కవిత కీలకోపన్యాసం చేస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కృషిని ఎత్తిచూపారు. 2014లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లును పార్లమెంటు ఆమోదించేలా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టు ఆమె గుర్తు చేశారు.
ఆ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ లు పలుమార్లు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తగా.. ముఖ్యమంత్రి కూడా ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. అయితే మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఓబీసీ మహిళలకు న్యాయం జరిగేలా పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అమలవుతున్నాయని, స్థానిక పరిపాలనలో మహిళల భాగస్వామ్యం దాదాపు 57 శాతానికి పెరిగిందని కవిత గుర్తు చేశారు.
తెలంగాణలో స్థానిక సంస్థల పదవుల్లో 55-57 శాతం మహిళలే ఉండటం గర్వకారణమని ఆమె అన్నారు . వారిలో 92 శాతం మంది బీఆర్‌ఎస్‌కు చెందిన వారేనని తెలిపారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్లు ఆమోదించబడినందున, రిజర్వేషన్లు లేని ఇతర దేశాల మహిళలకు సహాయం చేయడానికి దేశంలోని మహిళా నాయకులందరూ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కవిత చేస్తున్న కృషిని కార్యక్రమంలో వక్తలు అభినందించారు. మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకతను వెలుగులోకి తేవడానికి ఆమె ఢిల్లీలో ఒక రోజంతా నిరాహారదీక్ష చేయడమే కాకుండా.. రాజకీయ పార్టీలలో ఈ అంశంపై చర్చను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించారని గుర్తు చేశారు.
1950వ దశకంలో దేశ పార్లమెంట్‌లో 5 శాతంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం ఇప్పటివరకు కేవలం 15 శాతానికి పెరిగిందనీ, 33 శాతం రిజర్వేషన్ల కలను సాకారం చేయడం పెద్ద విజయమని, దానిని సాధించేందుకు కవిత చేసిన కృషి విశేషమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్లపై కవిత చేసిన కృషికి సంబంధించిన వీడియోను కూడా బ్రిడ్జ్ ఇండియా ప్రదర్శించింది.