
చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం మార్చి 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఈ రోజు కవిత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో టేబుల్ అయిందని అన్నారు. ‘‘కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో పాస్ చేసినందుకు మేడమ్ సోనియాకు సెల్యూట్ చేస్తున్నాను’’ అని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చిందని.. 300కి పైగా ఎంపీలు ఉన్న అందుకు ఆమోదం తెలుపడం లేదని విమర్శించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అభ్యర్థిస్తున్నానని చెప్పారు.
Also Read: ఈడీ ఎందుకు తొందరపడుందో అర్థం కావడం లేదు.. విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్సీ కవిత
ధరలు తగ్గించాలని, మరిన్ని రాయితీలు, ఉద్యోగాలు ఇవ్వాలని తాను ప్రధాని మోదీని కోరుతున్నానని చెప్పారు. తమలాంటి వారిని చిత్రహింసలు పెట్టడం ద్వారా వారికి ఏమి లభిస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల అధినేతలు పదవీకాలాన్ని పొడిగించినట్టుగా.. అగ్నివీర్ కింద రిక్రూట్ అయిన యువతకు ఎందుకు పొడిగించలేరని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీఎల్ సంతోష్ సిట్ ముందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులతో వేధిస్తున్నారని విమర్శించారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉందని అన్నారు. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు.
Also Read: జంతర్ మంతర్ వద్ద దీక్షకు పోలీసుల షరతులు!.. వెనక్కి తగ్గేది లేదంటున్న కవిత..
మోదీ వన్ నేషన్.. వన్ ఫ్రెండ్ స్కీమ్ అమలు చేస్తున్నారు అని కవిత మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అవుతుందని చెప్పారు. ఖమ్మంలో ఇటీవల సభ నిర్వహించామని.. ఏప్రిల్ అలాంటి సభ మరొకటి నిర్వహిస్తామని చెప్పారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని చెప్పారు. తాము బీ టీమ్ అయితే ఈడీ విచారణకు ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. ఎప్పటికీ తాము ఏ టీమేనని అన్నారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని భావిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ స్టాండ్‌పై వారినే అడగాలని చెప్పారు. అయితే రేపు మహిళా రిజర్వేషన్ల కోసం నిర్వహించే దీక్షలో 18 విపక్ష పార్టీలు పాల్గొంటాయని చెప్పారు. కాంగ్రెస్ దురహంకారాన్ని వీడి, వాస్తవాన్ని ఎప్పుడు ఎదుర్కొంటుందని ప్రశ్నించారు.