సొంత చెల్లిని, బిడ్డను కూడా ముట్టుకోలేని పరిస్థితి కల్పించారు.. కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాజయ్య..

By SumaBala Bukka  |  First Published Mar 15, 2023, 12:34 PM IST

లైంగిక ఆరోపణలు ఎదుర్కొని వివాదాస్పదంగా మారిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భోరున ఏడ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనమీద ఇలాంటి ఆరోపణలు చేశారంటూ కంటతడి పెట్టారు.


వరంగల్ : స్టేషన్ ఘన్ ఫూర్ ఎమ్మెల్యే రాజయ్య భోరుమని ఏడ్చారు. ఓ చర్చి ఫాదర్ బర్త్ డే వేడుకలకు హాజరైన ఆయన.. కేక్ ముందు కూర్చుని గుక్కపట్టి ఏడ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తన మీద లైంగిక ఆరోపణలు చేస్తున్నారని కంట కన్నీరు పెట్టుకున్నారు. సొంత చెల్లిని, బిడ్డను కూడా ముట్టుకోలేని పరిస్థితి కల్పించారు. నా కూతురు వయసున్న మహిళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు గెలిచాను. ఇక ముందు గెలవబోతున్నాను. 

ఘనపురం నియోజకవర్గంలో నాలుగుసార్లు గెలిచాను. ఏసుప్రభు మార్గంలో ఐదోసారి కూడా గెలిచి తీరతానని తెలిపారు. ఆయన గుక్కపట్టిఏడుస్తుంటూ.. చుట్టూ ఉన్నవారు ఆయనను ఓదార్చారు. తాడికొండ రాజయ్య గత కొంతకాలంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

Latest Videos

ఇదిలా ఉండగా, మార్చి 11న రెండేళ్లుగా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే టి రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం జానకిపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య ఆరోపించడం సంచలనంగా మారింది. తన భర్త ప్రవీణ్ తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.. ‘రెండేళ్ల నుంచి నన్ను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య వేధిస్తున్నారు. మా గ్రామానికి మొదటి నుంచి నిధులు కూడా విడుదల చేయడం లేదు. కొంతకాలం క్రితం మా పిల్లల పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసాము. మీరు మాకు తండ్రి లాంటివారు ఇలా చేయడం తగదు అని కూడా చెప్పాం. అయినా ఎమ్మెల్యే ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. 

ఈ వేధింపులు భరించలేక గత కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నాం. వీటన్నింటినీ మనసులో పెట్టుకుని మా గ్రామానికి నిధులు ఇవ్వడం లేదు. దీనికి తోడు బీఆర్ఎస్ మహిళ ఒకరు నన్ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించింది. నాతో మాట్లాడుతూ..  చాలామంది మహిళలు సార్ దగ్గరికి వచ్చి పోతుంటారు.  మీ గ్రామానికి నిధులు రావాలంటే.. మీ అవసరాలు తీరాలంటే మీరూ వస్తే  తీరతాయి.. అని నన్ను ప్రలోభట్టడానికి ప్రయత్నించింది.

 అయితే నేను అలాంటి దాన్ని కాదని ఆమెకి క్లియర్ గా చెప్పాను. టైం వచ్చినప్పుడు ఆ మహిళ ఎవరో పేరుతో సహా బయటపెడతా. వాళ్లందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఎలాంటి మాటలు మాట్లాడాడంటే... నామీద కోరికతోనే..  నేనంటే ఇష్టంతోనే పార్టీ టికెట్ నాకు ఇచ్చానని అంటాడా? ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయాను. నేను తండ్రి లాంటివాడివి అంటే.. బిడ్డ లాంటి దానితో ఐ లవ్ యు అని చెబుతాడా?  ఇవన్నీ నిజాలు కాదా? తప్పు చేసి  బుకాయించడం ఎందుకు? తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకోవాలి. నా వెనక ఎవరో ఉండి..  ఇదంతా ఆయన మీద కావాలని చేయిస్తున్నానని అంటారా?  ఇది న్యాయమేనా ?  అని ప్రశ్నించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది.

అయితే.. దీనిమీద ఎమ్మెల్యే రాజయ్య స్పందిస్తూ తనమీద కావాలనే బురద చల్లుతున్నారన్నారు. ఆ తరువాతి క్రమంలో నవ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య ఆమెతో, ఆమె భర్తతో మాట్లాడి ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. మళ్లీ ఇప్పుడు ఇలా కన్నీరు పెట్టడంతో మరోసారి ఆ అంశం తెరమీదికి వచ్చినట్టైంది. 

click me!