ఎమ్మెల్యే గంపాకు మళ్లీ మొదలైన మంట

First Published Aug 18, 2017, 11:56 AM IST
Highlights
  • ఉద్యమ వేళ ధర్నా చౌక్ గా మారిన గంపా నివాసం
  • మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది
  • గంపా ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
  • పాత రోజులు గుర్తు చేసుకుంటున్న జనాలు

 

తెలంగాణలో కామారెడ్డికి ప్రత్యేకత ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అంతటా ఉద్యమాలు సాగుతున్న కాలంలో కామారెడ్డి నిప్పు కణిక లా మండింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత కామారెడ్డి మళ్లీ పాత రూపు సంతరించుకుంటున్నది. దీంతో స్థానిక ఎమ్మెల్యే, విప్ గంపా గోవర్దన్ కు మళ్లీ మంట షురూ అయింది. ఆయనకు మంట ఎందుకో అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే.

2009 ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి టిడిపి తరుపున గంపా గోవర్దన్ గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత సిఎంగా ఉన్న వైఎస్ మరణించడం, ఆ తర్వాత కెసిఆర్ దీక్ష, తెలంగాణ ఉద్యమం తారా స్థాయికి చేరడం జరిగిపోయాయి. ఈ సందర్భంలో తెలంగాణలో జెఎసి పురుడుపోసుకుంది. అన్ని రాజకీయ పార్టీలు జెఎసిలో చేరిపోయాయి. ప్రజా ప్రతినిథులంతా రాజీనామాలు చేయాలంటూ జెఎసి అప్పుడు పిలుపునిచ్చింది. దీనికి టిఆర్ఎస్ సిద్ధపడి మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేలచేత రాజీనామాలు చేయించింది. ఆ సమయంలో కాంగ్రెస్, టిడిపి రాజీనామాలపై వెనకడుగు వేశాయి. బిజెపి లో ఉన్న యెండల లక్ష్మినారాయణ మాత్రమే రాజీనామా చేశారు. కిషన్ రెడ్డి చేయలేదు.

ఆ సందర్భంలో ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలంటూ జెఎసి వత్తిడి షురూ చేసింది. అప్పుటి నుంచి సుమారు ఒక ఏడాది పాటు కామారెడ్డిలో ఆందోళన కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గంపా ఇంటి ముందే జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మల్యే గంపా నివాసం ధర్నా చౌక్ గా మారిపోయింది. గంపా గోవర్దన్ ఇంటి ముందే ఉద్యమ కారులు టెంట్ వేసి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేవారు. టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న గంపా గోవర్దన్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ చేసేవారు. అలాగే తెలంగాణ అంతటా ఎమ్మెల్యలు, ఎంపిలు రాజీనామా చేయాలంటూ జెఎసి, టిఆర్ఎస్ కలిసి కట్టుగా భయంకరమైన వత్తిడి చేశాయి. కామారెడ్డిలో మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఎమ్మెల్యే ఇంటి ముందే టెంట్ వేసిన పరిస్థితి ఉంది.

ఇక కామారెడ్డి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న గంపా గోవర్దన్ తన ఇంటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. భారీ బందోబస్తు తో వెళ్లేవారు. వెనకా, ముందు పోలీసు వాహనాల తోడుగా ఆయన తన ఇంటికి వెళ్లి వచ్చేవారు. అది కూడా పగలు కాకుండ లేట్ నైట్ తన నివాసానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చేవారు. చాలారోజులపాటు ఆయన కామారెడ్డిలోని తన నివాసానికి వెళ్లడమే మానేసిన దాఖలాలున్నాయి కూడా. తీరా ఆయన టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరిపోయారు. టిఆర్ఎస్ తరుపున ఉప ఎన్నికలో పోటీ చేసి నెగ్గారు. టిడిపికి రాజీనామా చేసే వరకు గంపా ఇంటి ముందు ధర్నా చౌక్ కొనసాగింది.

ఇక సీన్ కట్ చేస్తే స్వరాష్ట్రంలో తెలంగాణ జెఎసి ఈనెల 10వ తేదీన కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 4వ దశ అమరుల స్పూర్తియాత్ర చేపట్టింది. దీన్ని సాగనివ్వకుండా టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలికారు. దీంతో కామారెడ్డిలో స్థానిక జెఎసి నేతలు కోదండరాం వస్తున్నాడు కదా అని సభ ఏర్పాట్లు చేసుకున్నారు. టెంట్లు వేసి వేదికను, సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసుకున్నారు. కానీ కోదండరాం ను బిక్నూరు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అదే సమయంలో రెచ్చిపోయిన టిఆర్ఎస్ కార్యకర్తలు కామారెడ్డిలో ఏర్పాటు చేసుకున్న సభా ప్రాంగణాన్ని చిందరవందర చేశారు. టెంట్లు కూల్చిపడేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. జెఎసి ప్రతినిధులపై దాడులు చేసి గాయపరిచారు. విద్యార్థులను చితకబాదారు.

అదంతా జరిగిపోయిందనుకున్న తరుణంలో గురువారం నాడు కామారెడ్డిలో విద్యార్థి సంఘాలన్నీ ఏకమై ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ఇంటి ముట్టడి చేపట్టాయి. విద్యార్థులపై దాడులను నిరసిస్తూ ఏకంగా ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి దిగడంతో పోలీసులు విద్యార్థులందరినీ చెదరగొట్టారు. కొందరిని అరెస్టు చేశారు. దీంతో కామారెడ్డిలో పాత రోజులు మళ్లీ వచ్చాయా అన్న చర్చ జనాల్లో జరుగుతున్నది. ఏ జిల్లాలో లేని విధంగా మరోసారి కామారెడ్డి ఎమ్మెల్యే ఇల్లు టార్గెట్ గా పోరాటాలు షురూ కావడం  చర్చనీయాంశమైంది.

విచిత్రమేమంటే ఆనాడు టెంట్ వేసి ఎమ్మెల్యేను ఇంటికి రాకుండా చేసింది జెఎసి నే. నేడు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చి ఇంటి ముందు ధర్నా చేసింది కూడా జెఎసి నే. 

click me!