కేసీఆర్‌ను కట్టడి చేయాలనే కవితపై కేసులు.. బీజేపీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 19, 2023, 04:32 PM IST
కేసీఆర్‌ను కట్టడి చేయాలనే కవితపై కేసులు.. బీజేపీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

సీఎం కేసీఆర్‌ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితను కేసులతో వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మోడీ ప్రభుత్వం మాటలు చెప్పడమే తప్పించి.. ఒక్క రూపాయి సాయం చేయలేదని మంత్రి చురకలంటించారు.  

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్‌ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితను కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్లు దోచుకున్న అదానీపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలేనన్న మంత్రి.. ఆయన వెంట వున్న వాళ్లంతా దొంగలేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కాంగ్రెస్ కట్టించని 10 ఇళ్లతో సమానమని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం మాటలు చెప్పడమే తప్పించి.. ఒక్క రూపాయి సాయం చేయలేదని మంత్రి చురకలంటించారు. మోడీ పాలనతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అవస్థలు పడుతున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. 

మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో శనివారం కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. కవిత పిటిషన్‌కు సంబంధించి తమ వాదన వినకుండా ఎలాంటి ముందస్తు నిర్ణయాలు ప్రకటించొద్దని ఈడీ సుప్రీంను కోరింది. 

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాం: ఢిల్లీకి బయలుదేరిన కవిత

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  గురువారం  విచారణకు  హాజరు కాలేనని  చివరి నిమిషంలో  ఈడీకి  కవిత  సమాచారం పంపడంలో  వ్యూహత్మకంగా  వ్యవహరించిందనే  అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మహిళలను  విచారించే  సమయంలో  తన హక్కులను చూపి  కవిత  విచారణకు గైర్హాజరయ్యారు. అయితే దీనిపై స్పందించిన ఈడీ ఈ నెల 20వ తేదీన విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. తొలుత ఈ నెల 11న కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో 9 గంటలకు పైగా కవితను విచారించిన ఈడీ అధికారులు.. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే కవిత గురువారం ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆమె అనూహ్యంగా విచారణకు గైర్హాజరు అయ్యారు. 

ఈ క్రమంలోనే కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 24కి సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా కవిత లేఖలో ప్రస్తావించారు. తాను వ్యక్తిగతంగా రావాలని సమన్లలోని ఎక్కడ పేర్కొనలేదని.. తన ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నానని చెప్పారు. సమన్లలో అడిగిన వివరాలను కూడా భరత్ ద్వారా పంపుతున్నానని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?