టెన్త్ పేపర్ లీక్‌ .. బీజేపీ కుట్రే, ముఖ్య నిందితుడు బండి సంజయ్‌కి సన్నిహితుడు : తలసాని ఆరోపణలు

Siva Kodati |  
Published : Apr 04, 2023, 10:20 PM ISTUpdated : Apr 04, 2023, 10:22 PM IST
టెన్త్ పేపర్ లీక్‌ .. బీజేపీ కుట్రే, ముఖ్య నిందితుడు బండి సంజయ్‌కి సన్నిహితుడు : తలసాని ఆరోపణలు

సారాంశం

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో కీలక నిందితుడు బీజేపీ కార్యకర్తని, బండి సంజయ్‌కి సన్నిహితుడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.

తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో కీలక నిందితుడు బీజేపీ కార్యకర్తని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ముఖ్య నిందితుడు .. బండి సంజయ్‌కి సన్నిహితుడని మంత్రి ఆరోపించారు. బండి సంజయ్‌ని తక్షణం పోలీసులు అరెస్ట్ చేయాలని.. పేపర్ లీక్ వెనుక వున్న బీజేపీ కుట్రను వెలికి తీయాలని తలసాని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారని.. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పిల్లల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గమైన చర్య అన్న ఆయన.. బీజేపీ నేతలకు పిల్లలు లేరా అని ప్రశ్నించారు. 

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. టెన్త్ పరీక్షా పత్రాల లీక్ వెనుక కుట్ర కోణం వుందని తేలిందన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. చిన్న పిల్లలను మధ్యలోకి తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఎవరు నిర్లక్ష్యంగా వహించినా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కుట్రలో భాగమైన వారికి పనిష్మెంట్ తప్పదన్నారు. 

ALso Read: హిందీ ప్రశ్నాపత్రం లీక్ .. స్నేహితుడి కోసం 16 ఏళ్ల బాలుడి పని, తెలంగాణ సర్కారే టార్గెట్ : వరంగల్ సీపీ

కాగా.. తెలంగాణ పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని వరంగల్ పోలీసులు ఛేదించారు. స్నేహితుడి కోసం 16 ఏళ్ల బాలుడు ఈ నేరానికి పాల్పడినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు వివరించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్ధి నుంచి హిందీ పరీక్షా పత్రాన్ని బాలుడు ఫోటో తీసుకున్నాడని సీపీ తెలిపారు. అనంతరం ఆ ప్రశ్నాపత్రం ఫోటోను తన సీనియర్ శివగణేష్‌కు నిందితుడు పంపాడని సీపీ పేర్కొన్నారు. 

తర్వాత శివ గణేష్ క్వశ్చన్ పేపర్ ను ప్రశాంత్ అనే మరో వ్యక్తికి వాట్సాప్ లో పంపాడని ఆయన తెలిపారు. టెన్త్ పేపర్ లీక్ అంటూ మెసేజ్ తయారు చేసి వివిధ గ్రూపులలో వేశాడు ప్రశాంత్. అలాగే ఉదయం 11.24కు బండి సంజయ్‌కి పేపర్ చేరిందని సీపీ చెప్పారు. ప్రశాంత్ 2 గంటల వ్యవధిలో 142 ఫోన్లు చేశాడని ఆయన వెల్లడించారు. ఇది పేపర్ లీక్ కాదని.. కాపీయింగ్ కోసమే జరిగిందని రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సెక్షన్ ఐదు కింద కేసు నమోదు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను డ్యామేజ్ చేసేందుకే నిందితులు ఇలా చేశారని సీపీ వెల్లడించారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకే ఈ కుట్రపన్నారని రంగనాథ్ తెలిపారు. రాష్ట్రంలో పరీక్షల వ్యవస్థ సరిగా లేదని చెప్పడానికే ఇలా చేశారని సీపీ పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్