రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం .. జనావాసాల మధ్యలో వున్న షాపింగ్ కాంప్లెక్స్‌లపై నిర్ణయం : మంత్రి తలసాని

By Siva KodatiFirst Published Jan 21, 2023, 5:37 PM IST
Highlights

జనావాసాల మధ్య వున్న షాపింగ్ కాంప్లెక్స్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్‌లో అగ్నిప్రమాదం నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనావాసాల మధ్య వున్న షాపింగ్ కాంప్లెక్స్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా వున్న కారణం చేత ఇప్పటికీ భవనంలోకి వెళ్లేందుకు సాధ్యం కావడం లేదన్నారు. దట్టమైన పొగ కారణంగా లోపల ఏమీ కనిపించడం లేదని.. అయితే ఓ మృతదేహం దొరికినట్లుగా తెలుస్తోందన్నారు. 

భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనుందని మంత్రి తెలిపారు. డెక్కన్ స్పోర్ట్స్ భవనాన్ని కూల్చివేస్తామని.. పక్కనే వున్న ఇళ్లకు ఏమైనా నష్టం వాటిల్లితే, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గతంలో అయ్యప్ప సొసైటీలో వున్న భవనం కూల్చివేతకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తలసాని వెల్లడించారు. 

ALso REad: షార్ట్ సర్క్యూట్ కారణం కాదు: రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారి శ్రీధర్

ఇదిలావుండగా.. రాంగోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ స్టోర్  భవనంలో  అగ్ని ప్రమాదానికి  షార్ట్ సర్క్యూట్ కారణం కాదని  విద్యుత్ శాఖాధికారి శ్రీధర్ చెప్పారు. డెక్కన్  నైట్ స్టోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం  జరిగితే  సెల్లార్ నుండి  మంటలు వ్యాపించేవని ఆయన అభిప్రాయపడ్డారు. భవనంలో  పై నుండి  కిందకు మంటలు వచ్చినట్టుగా విద్యుత్  శాఖాధికారి  మీడియాకు  చెప్పారు. 

భవనంలో మంటలు వ్యాపిస్తున్న సమయంలో  కూడా ఈ భవనంలో  ఉన్న విద్యుత్ మీటర్లలో విద్యుత్  ఉందని శ్రీధర్ చెప్పారు. ఈ భవనంలో  అగ్ని ప్రమాదం జరిగిందని  తమకు సమాచారం రాగానే ఈ ప్రాంతంలో  విద్యుత్ ను నిలిపివేసినట్టుగా విద్యుత్ శాఖాధికారి  చెప్పారు. గురువారం ఉదయం  11:20 గంటల నుండి  సాయంత్రం  06:20 గంటల వరకు విద్యుత్  సరఫరా నిలిపివేసినట్టుగా  విద్యుత్ శాఖాధికారులు స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం పోలీసుల అనుమతితో  ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్దరించినట్టుగా విద్యుత్ శాఖాధికారి శ్రీధర్  చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన  భవనం మినహా ఈ ప్రాంతమంతా  విద్యుత్ ను పునరుద్దరించినట్టుగా శ్రీధర్  వివరించారు.

click me!