రేవంత్, భట్టి కలిసి పాదయాత్ర చేయాలి.. కోమటిరెడ్డికి పార్టీలో కొనసాగే అర్హత లేదు: కొండా సురేఖ

By Sumanth KanukulaFirst Published Jan 21, 2023, 5:09 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర తప్పకుండా జరగాలని అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ అన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని తాను పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా చెప్పానని అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణ తప్పినవారిపై చర్యలు తీసుకుంటే.. మిగిలిన వారిలో కూడా క్రమశిక్షణ తప్పితే పార్టీలో నుంచి తీసేస్తారనే భయం ఉంటుందని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న గాంధీభవన్‌‌కు రావడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. 

పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే క్యాడర్‌లోకి మంచి సందేశం వెళ్తుందని అన్నారు. ఆయనకు పార్టీలో కొనసాగే అర్హత లేదన్నారు.  పార్టీ క్యాంపెయినర్‌ పదవి ఇచ్చినా దానిని నిలబట్టుకోలేకపోయారని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టుగా బయటపడ్డారని.. అందుకే ఆయనను తీసివేయాలని కోరారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర తప్పకుండా జరగాలని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. పాదయాత్ర చేస్తేనే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లగలమని.. కాంగ్రెస్ విజయం సాధించగలదని  అన్నారు. రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కలిసి పాదయాత్ర చేస్తే.. పార్టీ నాయకత్వం కలిసి ఉందని కార్యకర్తలు, ప్రజల్లోకి ఇండికేషన్ వెళ్తుందని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. పార్టీకి నష్టం చేకూర్చేలా చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్  చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన చర్యలు తీసుకోకపోవడం లేదని అన్నారు.  అందరం కలిసి పనిచేయలేకే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. ఇప్పటికైనా అందరం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులను కోరారు.

అయితే సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ సమావేశంలో వ్యక్తిగత  అంశాలు మాట్లాడొద్దని సూచించారు. సమావేశ అజెండా మీదే ఇక్కడ మాట్లాడాలని కోరారు. వ్యక్తిగత అంశాలు, డిమాండ్లు, ఏదైనా ఫిర్యాదులు ఉంటే.. పార్టీ ఇంచార్జ్‌ను కలిసి చెప్పొచ్చని అన్నారు.
 

click me!