
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యేగా అవకాశమివ్వడమే కాదు మంత్రిని కూడా చేసి రాజకీయంగా ఉన్నతస్థాయి కల్పించిన కేసీఆర్ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు సత్యవతి. కేసీఆర్ పై గుండెల్లో గూడుకట్టుకున్న అభిమానం మంత్రి చేతిపైకి చేరింది. పంటిబిగువన నొప్పిని దాచి చిరునవ్వుతో కేసీఆర్ అనే మూడక్షరాలు చిరకాలం తన చేతిపై నిలిచివుండేలా పచ్చబొట్టు వేయించుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా బంజారహిల్స్ లోని బంజారా భవన్ లో ఏర్పాటుచేసిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఆమెకు బంజారా, ఆదివాసి సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా గిరిజన బిడ్డలు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. ఈ క్రమంలోనే పచ్చబొట్టు స్టాల్ ను మంత్రి సందర్శించారు.
వీడియో
తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి చేతులమీదుగా సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి సత్యవతి. నొప్పిగా వుంటుందని చెప్పినా కేసీఆర్ పై అభిమానంతో భరించేందుకు కూడా సిద్దమయ్యారు. దీంతో రాంబాయి మంత్రి చేతిమీద కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేసారు. అనంతరం రాంబాయికి మంత్రి సత్యవతి నగదు బహుమతి అందజేసారు.
Read More ఏపీ ఇప్పుడు బొక్కబోర్లా పడింది.. కారణం ఆ ఇద్దరే : జగన్, చంద్రబాబులపై హరీష్‌రావు విమర్శలు
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. అనాది కాలంనుండి అణచివేతకు గురవుతున్న గిరిజనుల ఆత్మగౌరవంతో బ్రతికేలా కేసీఆర్ చేసారన్నారు. గత 75 ఏళ్లలో జరగని అభివృద్ది కేవలం 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, పోడుభూములకు పట్టాలు, గిరిజన తండాలను గ్రామపంచాయితీలు చేయడం, గిరిజన రిజర్వేషన్లు... ఇలా గిరిజనుల వృద్దికోసం కేసీఆర్ ఎంతో చేస్తున్నారని మంత్రి అన్నారు. అందువల్లే కేసీఆర్ గిరిజన ఆరాధ్య దైవంగా మారిపోయారని సత్యవతి రాథోడ్ కొనియాడారు.