టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఇవాళ ప్రారంభమైంది. గతంలో చోటు చేసుకున్న అవతవకలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలను టీఎస్‌పీఎస్‌సీ తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఆదివారం నాడు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీఎస్‌పీఎస్‌సీ.
2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ కావడంతో ఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. రద్దు చేసి న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఇవాళ నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 503 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 994 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు గాను 3,80, 072 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు.అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు పోలీసులు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు టీఎస్‌పీఎస్‌సీ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. వాచీలు, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, బంగారు ఆభరణాలకు అనుమతి లేదు. పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్ధులు షూలు వేసుకొంటే అనుమతి లేదని తేల్చి చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ . చెప్పులు వేసుకున్న వారినే పరీక్ష కేంద్రాలకు అనుమతిచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ సరిగా చేయకపోతే మరో ఓఎంఆర్ షీట్ ను ఇవ్వబోమని కూడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తేల్చి చెప్పింది.
టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలో బ్లూ లేదా బ్లాక్ పెన్ను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు నుండే అభ్యర్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షకు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు. చివరి నిమిషంలో పరీక్ష రాసేందుకు అభ్యర్ధులు పరుగెత్తుకుంటూ వచ్చారు.
హల్ టిక్కెట్లతో పాటు ఆధార్ , పాస్ పోర్టు వంటి గుర్తింపుకార్డులను తీసుకురావాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది. హల్ టిక్కెట్ పై ఫోటో లేకపోతే గెజిటెడ్ అధికారి సంతకంతో మూడు ఫోటోలతో రావాలని సూచించింది.