
తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఘట్‌కేసర్‌లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్డి సింహగర్జన సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డి.. తన ప్రసంగంలో పదే పదే కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ప్రశంసించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మల్లారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్తుండగా.. ఆగ్రహించిన కొందరు కాన్వాయ్ వెంటపడి మరీ రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లతో దాడి చేశారు. ‘‘మల్లా రెడ్డి డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అతి కష్టం మీద మల్లారెడ్డిని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.
తాజాగా ఈ ఘటనపై స్పందించిన మల్లారెడ్డి.. తనపై దాడి వెనక టీపీసీసీ చీఫ్ రేవంత్ర రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. రేవంత్ ప్రజావ్యతిరేక చర్యలను బహిరంగంగా ప్రశ్నించినందుకే ఈ కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు.తనపై కావాలని దాడి చేశారని విమర్శించారు. 100 మందిని పంపి చంపేందుకు చూశారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని, దేనికైనా సిద్దమేనని చెప్పారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేందుకు కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని చెప్పారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెరాస హామీ ఇచ్చిందన్నారు. అయితే రెండేళ్లలో కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని నేను వివరిస్తుండానే.. కొందరు వ్యతిరేకంగా నినాదాలు చేశారని చెప్పారు.
అసలేం జరిగిందంటే..
ఘట్‌కేసర్‌లో ఆదివారం నిర్వహించిన రెడ్డి సింహగర్జన సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. ఈ క్రమంలోనే కొందరు మల్లారెడ్డి ప్రసంగానికి అంతరాయం కలిగించడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని మంత్రి ప్రశంసించడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిలో కొందరు వేదికపైకి వెళ్లి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రెడ్డి సామాజికవర్గ సంక్షేమానికి సంబంధించిన సమావేశంలో రాజకీయ పార్టీలను పొగడటం ఏమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం కంటే ఏం చేయాలనుకుంటున్నారో మంత్రి మాట్లాడాలని నిర్వాహకులను కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డి కోరడం కనిపించింది. ప్రశ్నిస్తున్న వారిని నిర్వాహకులు శాంతింపజేయడంతో మంత్రి కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చింది. అయితే.. మల్లారెడ్డి మళ్లీ మాట్లాడటం ప్రారంభించిన వెంటనే ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే ఉన్నాడు. ఇది సభలోని కొందరిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వారు వేదిక వైపు కూడా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు, మంత్రి భద్రతాధికారులు ఆయనను వేదికపై నుంచి దింపారు.
మంత్రి సభా వేదిక నుంచి వెళ్లిపోతుండగా ప్రజలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని కుర్చీలు విసిరారు. దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కాన్వాయ్‌ను అడ్డుకున్న వారిని భద్రతా సిబ్బంది దూరంగా నెట్టివేశారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.