తన కొడుకును చూసేందుకు అనుమతివ్వడం లేదని ఆరోపిస్తూ సూరారంలోని నారాయణ ఆసుపత్రి వద్ద మంత్రి మల్లారెడ్డి బైఠాయించి ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: తన కొడుకును చూడనివ్వడం లేదని ఆరోపిస్తూ మంత్రి మల్లారెడ్డి సూరారంలోని నారాయణ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయం ఛాతీనొప్పి రావడంతో మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న తన కొడుకును చూసేందుకు ఐటీ అధికారులు అనుమతివ్వడం లేదని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
ఇవాళ ఉదయం తన నివాసంలో మహేందర్ రెడ్డి ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఐటీ అధికారులకు చెప్పారు. ఐటీ అధికారులు మహేందర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అయితే మహేందర్ రెడ్డి ఇంటికి సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు
ఐటీ అధికారులు. అయితే నారాయణ హృదయాలయానికి తరలించాలని మహేందర్ రెడ్డి కోరారు. తనకు తన సోదరుడు భద్రారెడ్డి వైద్య సలహలు ఇస్తారని ఐటీ అధికారులకు మహేందర్ రెడ్డి చెప్పారు. దీంతో నారాయణ హృదయాలయానికి తరలించారు. అయితే ఆసుపత్రికి వచ్చిన తర్వాత తన కొడుకును చూడకుండా ఐటీ అధికారులు అడ్డుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఐటీ శాఖకు చెందిన ఓ పెద్ద అధికారి అక్కడే ఉన్నారన్నారు. తన కొడుకు కన్నీరు పెట్టుకుంటున్నాడని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఛాతీపై కొట్టడం వల్లే మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైనట్టుగా మల్లారెడ్డి ఆరోపించారు. తన కొడుకుకు ఏం జరుగుతుందోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రీట్ మెంట్ చేసేందుకు వైద్యులను కూడా అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. తనను కూడా ఆసుపత్రికి రాకుండా అడ్డుకున్నారన్నారు. కానీ ఈ విషయం తెలిసి తానే ఇక్కడికి వచ్చినట్టుగా మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
నారాయణ హృదయాలయలో చేరిన మహేందర్ రెడ్డికి చికిత్స అందించేందుకు డాక్టర్ భద్రారెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీగా సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సహయకులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆసుపత్రి వద్దకు మంత్రి మల్లారెడ్డి అనుచరులు కూడా భారీగా చేరుకుంటున్నారు.
also read:కొడుకును చూసేందుకు ఆసుపత్రికి మంత్రి మల్లారెడ్డి: ఐటీ దాడులను నిరసిస్తూ అనుచరుల ఆందోళన
నిన్న ఉదయం నుండి మంత్రి మల్లారెడ్డి తో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు సాగుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు , ఇవాళ రాత్రివరకు సోదాలు సాగే అవకాశం ఉందని సమాచారం. తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులపై ఐటీ, ఈడీ దాడులు సాగే అవకాశం ఉందని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావించారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన పార్టీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఇటీవలనే మంత్రి గంగుల కమలాకర్ నివాసంపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి సోదాలు సాగుతున్నాయి.