టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసిన సిట్..

By Sumanth KanukulaFirst Published Nov 23, 2022, 9:33 AM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో ఇద్దరికి సిట్ నోటీసులు  జారీచేసింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో ఇద్దరికి సిట్ నోటీసులు  జారీచేసింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరిగా ఉన్న నందకుమార్ భార్య చిత్రలేఖకు, అంబర్‌పేటకు  చెందిన లాయర్ ప్రతాప్ గౌడ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఏ కింద వీరికి నోటీసులు జారీ చేసింది. వారిని బుధవారం రోజున విచారణ అధికారి ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే సిట్ నోటీసులు జారీ చేసిన ప్రతాప్ గౌడ్.. ఓ కీలక రాజకీయ నేతకు సన్నిహితుడని తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ కేసులో సిట్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో పాటు, కరీంనగర్‌కు చెందిన​ న్యాయవాది శ్రీనివాస్, బీడీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు తుషార్‌, కేరళకు చెందిన డాక్టర్  జగ్గు స్వామిలకు సిట్ నోటీసులు జారీచేసింది. ఈ నెల 21వ తేదీన విచారణకు రావాల్సిందిగా తెలిసింది. అయితే ఇందులో బండి సంజయ్‌కు సన్నిహితుడైన శ్రీనివాస్ మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఇక, సిట్ ఎదుట హాజరు కావడానికి తనకు సమయం కావాలని కోరుతూ బీఎల్ సంతోష్‌ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇందుకు గుజరాత్ ఎన్నికల కారణంగా తన బిజీ షెడ్యూల్ కారణమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తుషార్‌, జగ్గుల నోటీసులకు స్పందించకపోవడంతో వారిపై సిట్ లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. 

ఇదిలా ఉంటే.. సోమ, మంగళ వారాల్లో లాయర్ శ్రీనివాస్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. సింహయాజీతో అతని సంబంధం, నంద కుమార్‌తో నగదు లావాదేవీలపై అతన్ని సిట్ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక, బుధవారం కూడా విచారణకు రావాల్సిందిగా శ్రీనివాస్‌ను సిట్ కోరింది. ఇక, మంగళవారం విచారణ అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. సింహయాజీ తన గురువు అని చెప్పారు. ‘‘ఒక భక్తుడిగా ఆయన నన్ను అడిగినప్పుడు నేను టిక్కెట్లు బుక్ చేశారు. టికెట్ బుక్ చేయడం నేరం కాదు’’ అని అన్నారు. అయితేఈ కేసులో మరో నిందితుడు నంద కుమార్‌తో అరగంట సేపు ఎందుకు కాల్‌లో ఉన్నారని ప్రశ్నించగా.. శ్రీనివాస్ మాట్లాడేందుకు నిరాకరించి వెళ్లిపోయారు.

ఇక, ఈ కేసులో ముగ్గురు నిందితులు సింహయాజీ, రామచంద్ర భారతి, నందకుమార్‌లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్‌.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిని నిందితుల తరఫు  న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. 
 

click me!