ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు ప్రతీకారంగానే: ఐటి దాడులపై కెసిఆర్

By Sumanth KanukulaFirst Published Nov 23, 2022, 9:59 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో అందుబాటులో ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ వరుస దాడులపై కేసీఆర్ వారితో చర్చించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో అందుబాటులో ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ వరుస దాడులపై కేసీఆర్ వారితో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రం వైఖరిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను బట్టబయలు చేసినందుకే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సూచనల మేరకు కేంద్ర ఏజెన్సీలు టీఆర్‌ఎస్‌ నేతలపై దాడులు జరుపుతున్నాయని సీఎం కేసీఆర్ పార్టీ  నేతలకు చెప్పినట్టుగా తెలిసింది. 

ఈ దాడులపై భయాందోళన చెందవద్దని మంత్రులు, సీనియర్ నాయకులకు కేసీఆర్ చెప్పారు. పార్టీ నుంచి నైతిక, చట్టపరమైన మద్దతు ఉంటుందని హామీ  ఇచ్చారు. గత కొద్ది రోజులుగా మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్రపై జరుగుతున్న దాడుల ద్వారా టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన కేసీఆర్.. ఈ వ్యవహారాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యచరణపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్టుగా తెలిసింది.

మరోవైపు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల నివాసాలు, విద్యాసంస్థల్లో ఐటీ సోదాల నేపథ్యంలో మంగళవారం కేసీఆర్..  కొందరు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసిన సిట్..

ఇదిలా ఉంటే.. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో అత్యవసరంగా సమావేశమమ్యారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, నగర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ఎదుర్కొంటామని చెప్పారు. 

‘‘ఈరోజు వ్యవస్థలు మీ చేతుల్లో ఉండొచ్చు.. రేపు మా చేతుల్లో ఉండవచ్చని మర్చిపోవద్దు’’ అని మంత్రి తలసాని అన్నారు. టీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని.. వీటి గురించి సీఎం కేసీఆర్ ముందే చెప్పారని తెలిపారు. ప్రజలను చైతన్యవంతులను చేసి.. దాడులను ఎదుర్కొంటామని  స్పస్టం చేశారు. 


 

click me!