
మునుగోడు మండలం పలివెలలో చోటుచేసుకున్న పరిణామాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. పులివెలలో టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గుండాలు దాడి చేశారని విమర్శించారు. 25 రోజులుగా తమ ప్రచారం తాము చేసుకున్నామని.. ఎక్కడ ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్‌లపైన కూడా దాడి జరిగిందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కేటీఆరర్ మాట్లాడుతూ.. ఓడిపోయేవాళ్లు ఇలాంటి చిల్లర పనులే చేస్తారని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసు కేసు పెట్టినమని.. చట్టప్రకారం ఎదుర్కొందామని చెప్పారు. ఎవరూ తొందరపడవద్దని టీఆర్ఎస్ శ్రేణులను కోరారు.
గ్రామాల్లో కావాలని కయ్యానికి దిగే ప్రయత్నం చేస్తరని అన్నారు. ఎంత రెచ్చగొట్టినా టీఆర్ఎస్ శ్రేణులు ఉద్రేకపడొద్దని పిలుపునిచ్చారు. నవంబర్ 3న టీఆర్ఎస్‌కు ఓటేసి వాళ్లకు బుద్దిచెప్పాలని కోరారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజల సమస్యలు తీర్చేందుకు తాను, మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్యను గత ప్రభుత్వాలు పట్టించుకున్నాయా అని ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ గెలిసే సిలిండర్ ధర రూ. 1,500 అవుతుందన్నారు. గ్యాస్ ధర ఎంత పెంచినా వాళ్లకే ఓటు వేస్తున్నారని మరింత పెంచుతారని అన్నారు. గుజరాత్ నుంచి వచ్చే డబ్బులతో గెలవాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. జనధన్ ఖాతాలో డబ్బులు వేస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. కార్పొరేట్లకు వత్తాసు పలికే బీజేపీకి డిపాజిట్ కూడా రావొద్దని కోరారు.
ఇక, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. అయితే ప్రచారం ముగింపుకు కొన్ని గంటల ముందు మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న ఇరు పార్టీలకు చెందిన వారు ఒకేచోటకు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరింది. ఇరు పార్టీలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. ఇక, ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.