మునుగోడులో టీఆర్ఎస్ చెంపచెల్లుమనే తీర్పు వస్తోంది.. దాడులు చేయడం బీజేపీ సంస్కృతి కాదు: ఈటల రాజేందర్

By Sumanth KanukulaFirst Published Nov 1, 2022, 3:56 PM IST
Highlights

మునుగోడు మండలం పలివెలలో చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తమపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. 

మునుగోడు మండలం పలివెలలో చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తమపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. గెలవరు అనే భయంతోనే టీఆర్ఎస్ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే దాడులు జరిగాయని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ చెంపచెల్లుమనే తీర్పు వస్తోందన్నారు. మునుగోడు ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. 

టీఆర్ఎస్ నేతలు అసహనంతోనే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అహంకారానికి, పోలీసు రాజ్యానికి చరమగీతం పాడాలని కోరారు. దాడులు చేయడం బీజేపీ సంస్కతి కాదని అన్నారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో 30 మందికి గాయాలు అయ్యాయని చెప్పారు. తన పీఏ, గన్‌మెన్లు, మరికొందరికి గాయాలు అయ్యాయని తెలిపారు. దాడిలో 10 నుంచి 15 కార్లు కూడా ధ్వంసం అయ్యాయని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని అన్నారు. తమ ఆశయం పంచాయితీ కాదని చెప్పారు. దాడి జరుగుతన్నప్పటికీ.. గన్‌మెన్‌లను ఫైర్ ఓపెన్ చేయవద్దని చెప్పానని అన్నారు. తాను, తన భార్య చావుకైనా సిద్దపడతం కానీ.. కేసీఆర్‌ను గద్దె దించేవరకు పోరాడతామని తెలిపారు.

Latest Videos

ఇదే ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. హింసను ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఆరోపించారు. ప్రణాళిక ప్రకారమే ఈటల రాజేందర్, ఆయన భార్యపై దాడికి దిగారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసే టీఆర్ఎస్ ఈ రకమైన దాడులకు దిగిందన్నారు. టీఆర్ఎస్ దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని చెప్పారు. పోలీసు సిబ్బంది టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. అయితే ప్రచారం ముగింపుకు కొన్ని గంటల ముందు మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న ఇరు పార్టీలకు చెందిన వారు ఒకేచోటకు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ  చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి  జరింది. ఇరు పార్టీలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. ఇక, ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

click me!